అధికంగా ఉన్న శరీర బరువును తగ్గించుకునేందుకు అనేక మంది అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. కొందరైతే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు పెరుగుతారు తప్ప, బరువు తగ్గరని వారంటున్నారు. ఈ క్రమంలో పలువురు పరిశోధకులు ఈ విషయంపై తాజాగా పరిశోధనలు చేసి ఆ వివరాలను వెల్లడించారు కూడా..!
జర్మనీకి చెందిన లుబెక్ యూనివర్సిటీ పరిశోధకులు 23 సంవత్సరాల వయస్సు ఉన్న 16 మందిని రెండు గ్రూపులుగా విభజించి వారికి 3 రోజుల పాటు భిన్న రకాల ఆహారం ఇచ్చారు. ఒక గ్రూపు వారికి అధికంగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇస్తే.. అదే ఆహారాన్ని రెండో గ్రూపు వారికి రాత్రి డిన్నర్ రూపంలో ఇచ్చారు. తరువాత వారం గ్యాప్ ఇచ్చి మళ్లీ అదే విధంగా ఆహారం ఇచ్చారు. ఈ క్రమంలో వారిని పరీక్షించిన పరిశోధకులు తేల్చిందేమిటంటే.. ఉదయం అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకున్న వారి మెటబాలిజం పెరిగిందని, వారిలో క్యాలరీలు త్వరగా ఖర్చవుతున్నాయని, అదే రెండో గ్రూపు వారిలో మెటబాలిజం తగ్గిందని గుర్తించారు.
అందువల్ల సదరు పరిశోధకులు చెబుతున్నది ఏమిటంటే.. ఎవరైనా సరే అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఉదయమే బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవాలని, దాంతో బరువు తగ్గుతారని, అదే రాత్రి పూట ఆ ఆహారాన్ని తీసుకుంటే బరువు పెరుగుతారని అంటున్నారు. అలాగే ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కూడా మంచిదికాదని, దాంతో రోజు మొత్తంలో అవసరం అయిన ఆహారం కన్నా ఎక్కువ ఆహారం తీసుకుంటారని, దీని వల్ల అధిక బరువు పెరుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. కనుక.. బరువు తగ్గాలంటే.. ఉదయమే ఎక్కువ ఆహారం తీసుకోండి. రాత్రి పూట వీలైనంత తక్కువగా తినండి. దీంతో బరువు తగ్గడమే కాదు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు..!