ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్నికల విషయంలో జగన్, కమీషనర్ నిమ్మగడ్డ ఇద్దరూ పట్టుదలగా ఉండటంతో అసలు ఏం జరుగుతుందో అనే చర్చ జరుగుతుంది. ఇక తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌కు మెమో జారీ చేసారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులపై ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసారు. మధ్యాహ్నం 3 గంటలకు తాను సమావేశానికి పిలిచినా సరే సమావేశానికి హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌కు మెమో జారీ చేసారు. సాయంత్రం 5 గం.కు భేటీకి తప్పక హాజరుకావాలని మెమో ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశానికి రావాలని మెమోలో స్పష్టం చేసారు.
ఇవాళ ఉదయం 10గంటలకు తొలుత సమావేశం ఏర్పాటు చేయగా సీఎంతో సమావేశం ఉందని చెప్పటంతో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశ సమయం మార్చారు. పంచాయితీ రాజ్ కార్యదర్శి, కమీషనర్ ఇద్దరూ కూడా హాజరు కాలేదు. చివరిగా 5 గంటలకు రావాలి చెప్పినా సరే మళ్ళీ రాలేదు. దీనితో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఎస్ కు లేఖ రాసే అవకాశం ఉంది.