తల్లిగా మారడం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ సమయంలో ఎదురయ్యే సందేహాలలో ఒకటి అదే తల్లిపాలు ఇవ్వడం వల్ల శరీరంలోని చక్కెర (షుగర్) స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా గర్భధారణ సమయంలో లేదా అంతకు ముందు నుండే మధుమేహం (డయాబెటిస్) ఉన్న కొత్త తల్లులకు ఈ సందేహం ఉంటుంది. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల మీకు, మీ బిడ్డకు కలిగే ప్రయోజనాలేంటి? ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం..
తల్లిపాలు ఇవ్వడం అనేది శరీరంలోని చక్కెర స్థాయులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ప్రధానంగా బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు తల్లి శరీరం శక్తిని పెద్ద మొత్తంలో వినియోగించుకుంటుంది. ఈ శక్తి ఉత్పత్తికి, శరీరం నిల్వ చేసిన గ్లూకోజ్‌ను ఉపయోగిస్తుంది దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
ఇది గర్భధారణ మధుమేహం నుండి కోలుకుంటున్న తల్లులకు ముఖ్యంగా ప్రయోజనకరం. అంతేకాకుండా బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లి శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. అంటే శరీర కణాలు ఇన్సులిన్‌కు మెరుగ్గా ప్రతిస్పందిస్తాయి ఇది రక్తంలో చక్కెరను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలికంగా చూస్తే, తల్లిపాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

అయితే కొత్త తల్లులు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే పాలిచ్చేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం జరగవచ్చు, ముఖ్యంగా ఇన్సులిన్ లేదా ఇతర మధుమేహ మందులు తీసుకునేవారికి. దీనిని నివారించడానికి, మీరు క్రమం తప్పకుండా, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పాలిచ్చే ముందు లేదా సమయంలో చిన్నపాటి స్నాక్స్ (పండ్లు, నట్స్) తీసుకోవడం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తాగడం మరియు వైద్యుల సలహా మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవడం కూడా అవసరం. మీ బిడ్డకు పాలు ఇవ్వడం తల్లికి, బిడ్డకు ఇద్దరికీ ఆరోగ్యాన్ని అందించే ఒక శక్తివంతమైన ప్రక్రియ. ఇది బిడ్డకు రోగనిరోధక శక్తిని ఇస్తే, తల్లికి బరువు తగ్గడంలో మరియు ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మీరు మధుమేహంతో బాధపడుతూ, తల్లిపాలు ఇస్తున్నట్లయితే మీ ఆహారం, మందుల మోతాదు మరియు చక్కెర స్థాయిల నిర్వహణ గురించి వ్యక్తిగతీకరించిన సలహా కోసం మీరు వెంటనే మీ డాక్టర్నును సంప్రదించండి.
