వికాసం / స్ఫూర్తికథలు.. ఒక మంచి అబ్బాయి…

-

మనస్సు మంత్రం – మీరు ఏ భావోద్వేగాన్ని ప్రపంచంలోకి చొప్పించినా అది మరింత వ్యాపిస్తుంది. మీరు మంచి చేస్తే, మంచితనం వ్యాపిస్తుంది. మీరు చెడు చేస్తే, ప్రతికూలత వ్యాపిస్తుంది. మీరు చాలా శక్తివంతమైన పవర్‌హౌజ్‌ అని గ్రహించండి. మీ మంచి లేదా చెడు పెద్దవై మీ వద్దకు తిరిగి వస్తాయి. మీకు నచ్చిన మార్గాల్లో, బహుశా మీరు అర్థం చేసుకోగల మార్గాల్లో కాకపోవచ్చు. కానీ తప్పక తిరిగి వస్తుంది. అందుకే మీ పరిసరాలను సానుకూలంగా ఉంచుకోండి…


ఒక ఆరు సంవత్సరాల అబ్బాయి తన 4 ఏళ్ల చెల్లెలితో కలిసి మార్కెట్‌కు వచ్చాడు. అన్ని దుకాణాలు కలియదిరుగుతూ, విశేషాలుంటే తన చెల్లెలికి చెబుతూ నడుస్తున్నాడు. అకస్మాత్తుగా పక్కకు చూసేసరికి పాప కనబడలేదు. వెనక్కి తిరిగి చూడగా, ఒక షాపు దగ్గర నిలబడి ఆ అమ్మాయి తదేకంగా షాపువైపే చూస్తోంది.

చెల్లెలి దగ్గరికి చేరుకున్న బాలుడు, ‘నీకేమైనా కావాలా?’ అని ఆప్యాయంగా అడిగాడు. అప్పుడు ఆ పాప ఆ షాపులో ఉన్న ఒక బొమ్మ వైపు వేలు చూపించింది. చెల్లెలి చేయి పట్టుకుని బొమ్మ వద్దకు వెళ్లి, ఆ బొమ్మను తీసి తనకిచ్చాడు. వెలుగుతున్న మొహంతో ఆ బొమ్మను తీసుకున్న చెల్లెల్ని ఎంతో సంతోషంగా చూసాడు ఆ అన్నయ్య. ఇదంతా గమనిస్తున్న ఆ షావు యజమాని బాలుడి పరిణితికి ముచ్చటపడ్డాడు.

బాలుడు కౌంటర్‌ వద్దకు చేరుకుని, ‘ సర్‌.. ఈ బొమ్మ ధర ఎంత?’ అని అడిగాడు. ఆ దుకాణపు యజమాని ఎంతో మంచివాడు. జీవితంలో కష్టసుఖాలను తెలుసుకున్న వ్యక్తి. ‘నువ్వు ఎంత ఇవ్వగలవు?’ అని ప్రేమగా అడిగాడు అబ్బాయిని. ఆ బాలుడు వెంటనే తన జేబులోనుండి గుప్పెడు తీసాడు. అవి సముద్రతీరంలో దొరికే గవ్వలు. వాటిని చాలా సీరియస్‌గా షాపతనికి ఇచ్చేసాడు. ఆయన వాటిని ఎంతో జాగ్రత్తగా నాణాలను లెక్కపెట్టినట్లుగా లెక్కపెట్టి అబ్బాయివైపు చూసాడు. ‘ఏంటీ.. తక్కువున్నాయా..? అని ఎంతో ఆవేదనతో అడిగాడు ఆ అబ్బాయి. వెంటనే ఆ యజమాని ‘లేదు నాయనా. బొమ్మ ధర కంటే ఇవి ఎక్కువే ఉన్నాయి. అందుకే మిగిలినవి నీకు తిరిగిఇస్తున్నాను’ అని ఒక నాలుగు గవ్వలు మాత్రం తీసుకుని, మిగిలినవి ఆ అబ్బాయికే ఇచ్చేసాడు.

ఆ బాలుడు ఎంతో సంతోషంగా వాటిని మళ్లీ జేబులో వేసుకుని, చెల్లెల్ని తీసుకుని వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా గమనిస్తున్న ఆ షాపు పనివాడు, ‘ఏంటి సర్‌.. ? అంత ఖరీదయిన బొమ్మను కేవలం నాలుగు గవ్వలకు ఇచ్చేస్తారా?’ అని ప్రశ్నించాడు

అప్పుడు ఆ షాపాయన చిరునవ్వుతో సమాధానమిస్తూ, ‘’ మనకు సంబంధించినంత వరకు ఇవి గవ్వలే. కానీ ఆ అబ్బాయికి మాత్రం వెల కట్టలేనివి. అలాగే ఈ వయస్సులో తనకు డబ్బంటే ఏంటో తెలియదు కానీ, పెద్దయ్యాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. డబ్బుకు బదులుగా గవ్వలతో ఒక బొమ్మను కొన్నానని తనకు గుర్తొచ్చినప్పుడల్లా నేను గుర్తొస్తాను. దానివల్ల అతను ప్రపంచమంతా మంచే ఉందని సంతోషిస్తాడు. అందువల్ల అతనికి సానుకూల దృక్పథం అలవడుతుంది. తను కూడా మంచిగానే ఉండాలనే తపన మొదలవుతుంది.’’ అని నవ్వాడు.

– చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news