గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా చేసిందని.. ఇప్పుడు కూడా రానివ్వకుండా చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షను నిర్వహించలేక గాలికి వదిలేసింది. మేము వచ్చాక గ్రూప్-1 పరీక్షను సక్రమంగా నిర్వహించాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని బీఆర్ఎస్ అనేక కుట్రలు చేస్తోంది.
అలాంటి కుట్రలను తిప్పికొట్టి నిరుద్యోగులకు ఈరోజు మా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదని’ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.