రహస్య భేటీపై BRS ఎమ్మెల్యేల క్లారిటీ.. మల్లారెడ్డి వైఖరిపై అసంతృప్తితోనే అంటూ..

-

మేడ్చల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్‌రెడ్డి, వివేకానంద్‌, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు. దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేల పీఏలు సహా అత్యంత సన్నిహితులను కూడా దూరంగా ఉంచినట్లు తెలిసింది. పార్టీ పదవులు, నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో మంత్రి మల్లారెడ్డి వైఖరిపై వారంతా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు సమావేశమై ఆయా అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

రహస్య భేటీపై ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి రహస్య భేటీ జరగడం లేదని ఎమ్మెల్యే వివేకానంద స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించామని తెలిపారు. చాలా మందికి పదవులు ఇస్తామని మాట ఇచ్చామని.. పదవులన్నీ మేడ్చల్‌కే వెళ్తున్నాయని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని అన్నారు. కార్యకర్తలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి విషయంలో అందరినీ కలుపుకుని పోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. ఒక్క నియోజకవర్గానికే పదవులన్నీ పోతున్నాయని.. జిల్లా పదవులన్నీ మంత్రి మల్లారెడ్డి ఒక్కరే తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. అందరితో మాట్లాడాలని సీఎం చెప్పినా మంత్రి పట్టించుకోవట్లేదని వాపోయారు. కార్యకర్తల ఆవేదన తెలిపేందుకే సమావేశమని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news