నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్ వద్ద ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. గత మూడు రోజులుగా కార్మికులు సొరంగంలోనే ఉండిపోయారు. వారు బతికి ఉన్నారా..? లేదా జరగరానిది ఏమైనా జరిగిందా..? అనే విషయం కూడా ఇంతవరకు తెలియరాలేదు. సహాయక చర్యలు మాత్రం మూడు రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నిత్యం పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం SLBC టన్నెల్ వద్దకు వెల్లాలని నిర్ణయించుకున్నది. ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. తమ పర్యటనకు పోలీసులు ఆటంకం కలిగించొద్దని సూచించారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాము ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదని స్పష్టం చేశారు హరీశ్ రావు.