కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ ముగిసింది. కరోనా ఎమర్జెన్సీ ఫండ్ నుంచి రాష్ట్రానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశామని బుగ్గన పేర్కొన్నారు. 981 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్న ఆయన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అత్యంత తక్కువ కరోనా మరణాల రేటు ఉందని ఆయన అన్నారు. మార్చి నుంచి కరోనా పరీక్షల సంఖ్యను పెంచామన్న ఆయన కోవిడ్ కేర్ సెంటర్లను కూడా పెంచామని అన్నారు.
కరోనా వల్ల ఖర్చు పెరిగి, ఆదాయం తగ్గిందని ఆయన అన్నారు. 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్న ఆయన ఈ మెడికల్ కాలేజీలకు ఏర్పాటుకు అనుమతించాలని కోరానని అన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరామని రాష్ట్ర వినతిని పరిశీలిస్తామని కేంద్ర వైద్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని అన్నారు.