ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

-

ఒక‌ప్పుడు డెస్క్‌టాప్ కంప్యూట‌ర్ల‌ను కొనాలంటే ఆచి తూచి అడుగు వేసేవారు. ఎందుకంటే అవి చాలా ఖ‌రీదైన‌వి కాబ‌ట్టి. ఇక ల్యాప్‌టాప్‌ల మాట చెప్ప‌లేం. ఒక‌ప్పుడు అవి చుక్క‌ల‌నంటే ధ‌ర‌ల్లో ఉండేవి. కానీ టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఇప్పుడు అన్నీ త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు కూడా చాలా తక్కువ ధ‌రకే మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల‌లో అయితే రాయితీల‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ల్యాప్‌టాప్‌ల ధ‌ర మ‌రింత త‌గ్గుతుంది. అయితే ల్యాప్‌టాప్ కొనేముందు అస‌లు వాటిల్లో ఎలాంటి ఫీచ‌ర్లు చూడాలి ? ఏ ల్యాప్‌టాప్ అయితే బాగుంటుంది ? అంటే.. అందుకు కింద తెలిపిన టిప్స్ ప‌నికొస్తాయి. అందుకు అనుగుణంగా మీకు న‌చ్చిన ల్యాప్‌టాప్‌ను మీరే ఎంపిక చేసుకోవ‌చ్చు. మ‌రి ల్యాప్‌టాప్ కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఆ విష‌యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బడ్జెట్
ల్యాప్‌టాప్ కొనేవారు క‌చ్చితంగా బ‌డ్జెట్ ను ముందు నిర్ణ‌యించుకోవాలి. ఫ‌లానా ధ‌ర‌లో మాత్ర‌మే ల్యాప్‌టాప్ కొనాల‌ని ముందుగానే అనుకోవాలి. దాంతో బ‌డ్జెట్‌కు అనుగుణంగా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ‌డ్జెట్ నిర్ణ‌యించాకే దానికి అనుగుణంగా ల్యాప్‌టాప్ ఫీచ‌ర్ల‌ను ఎంపిక చేసుకోవాలి.

2. ప్రాసెస‌ర్
డెస్క్‌టాప్ అయినా ల్యాప్‌టాప్ పీసీ అయినా.. ఏదైనా సరే.. పీసీ ఎంపిక చేసేట‌ప్పుడు ముందుగా ప్రాసెస‌ర్‌పై ఓ లుక్కేయాలి. ఎందుకంటే పీసీ వేగంగా ప‌నిచేయాలంటే ప్రాసెస‌ర్ చాలా వేగ‌వంత‌మైంది అయి ఉండాలి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో మ‌న‌కు ఇంటెల్, ఏఎండీ రెండు కంపెనీల‌కు చెందిన ప్రాసెస‌ర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటెల్ ప్రాసెసర్లు బాగా వేగంగా ప‌నిచేస్తాయి కానీ ధ‌ర ఎక్కువ‌. డ‌బ్బులు వెచ్చిస్తామ‌నుకుంటే ఇంటెల్ ప్రాసెస‌ర్ ఉన్న ల్యాప్‌టాప్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. లేదా బ‌డ్జెట్ మీరుతుంది అనుకుంటే ఏఎండీ ప్రాసెస‌ర్ ఉన్న ల్యాప్‌టాప్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇంటెల్‌లో మ‌న‌కు కోర్ ఐ3, ఐ5, ఐ7, ఐ9 ప్రాసెసర్లు ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. నంబ‌ర్ పెరిగే కొద్దీ ప్రాసెస‌ర్ వేగంగా ప‌నిచేస్తుంద‌ని అర్థం చేసుకోవాలి.

3. హార్డ్ డిస్క్, ఎస్ఎస్‌డీ
ప్ర‌స్తుతం మార్కెట్‌లో 1టీబీ కెపాసిటీ ప్రారంభం నుంచి హార్డ్ డిస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ను వీడియో ఎడిటింగ్‌, గ్రాఫిక్స్ కోసం తీసుకుంటే 2 టీబీ లేదా 4 టీబీ హార్డ్ డిస్క్‌లు తీసుకోవాలి. లేదంటే 1టీబీ హార్డ్ డిస్క్ స‌రిపోతుంది. ఇక ఎస్ఎస్‌డీ విష‌యానికి వ‌స్తే.. ఇవి కూడా ఒక ర‌కంగా చెప్పాలంటే హార్డ్ డిస్క్‌లే. ల్యాప్‌టాప్‌లో సి డ్రైవ్ కోసం వీటిని వాడుతారు. ఎందుకంటే ఆ డ్రైవ్‌లో విండోస్‌తోపాటు ఇత‌ర సాఫ్ట్‌వేర్ల‌ను ఇన్‌స్టాల్ చేస్తారు క‌దా. క‌నుక అవి వేగంగా ప‌నిచేయ‌డానికి ప్ర‌త్యేకంగా సి డ్రైవ్ కోస‌మే ఎస్ఎస్‌డీ ఉప‌యోగిస్తారు. ఇవి 128 జీబీ సైజ్ నుంచి ల‌భ్యం అవుతాయి. బడ్జెట్ లోపు ఉన్న వారు 128 జీబీ తీసుకుంటే చాలు. ఖ‌ర్చు పెడ‌తాం అనుకుంటే 256, 512 జీబీ ఎస్ఎస్‌డీల‌ను తీసుకోవాలి.

4. డిస్‌ప్లే సైజ్
మార్కెట్‌లో చాలా వ‌ర‌కు 13 ఇంచులు మొద‌లుకొని 21 ఇంచుల డిస్‌ప్లే ఉన్న ల్యాప్‌టాప్‌లు ల‌భిస్తున్నాయి. సాధార‌ణ యూసేజ్‌కు 15 ఇంచుల వ‌ర‌కు డిస్‌ప్లే ఉంటే చాలు. గ్రాఫిక్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోస‌మైతే 17, 21 ఇంచుల డిస్‌ప్లే ఉన్న ల్యాప్‌టాప్‌ల‌ను తీసుకోవాలి.

5. గ్రాఫిక్స్
వీడియోగేమ్స్ ఆడేవారు, గ్రాఫిక్స్‌, ఎడిటింగ్ ప‌నులు చేసుకునేవారు క‌నీసం 4జీబీ గ్రాఫిక్స్ మెమొరీ ఉన్న ల్యాప్‌టాప్‌ల‌ను తీసుకోవాలి. స‌రిపోద‌నుకుంటే 6, 8, 16 జీబీ గ్రాఫిక్స్ మెమొరీ ఉన్న ల్యాప్‌టాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాక‌పోతే వాటి ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటుంది. బ‌డ్జెట్ దాటినా ఫ‌ర్వాలేదు అనుకుంటే హై ఎండ్ గ్రాఫిక్స్ మెమొరీ ఉన్న ల్యాప్‌టాప్‌ల‌ను ఖ‌రీదు చేయ‌వ‌చ్చు.

6. బ్యాట‌రీ
ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధార‌ణ ల్యాప్‌టాప్‌లు గ‌రిష్టంగా 2 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తాయి. ఇక ఎక్కువ కావాల‌నుకుంటే ల్యాప్‌టాప్‌కు అధిక ధ‌ర వెచ్చించాలి. సాధార‌ణంగా హై ఎండ్ ల్యాప్‌టాప్‌లు గ‌రిష్టంగా 7 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తాయి. ధ‌ర ఫ‌ర్వాలేదు అనుకుంటే వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

7. బ్రాండ్
ప్ర‌స్తుతం మార్కెట్‌లో డెల్ ల్యాప్‌టాప్‌ల‌కు మంచి డిమాండ్ ఉంది. వీటి ఖ‌రీదు కూడా ఎక్కువే. త‌క్కువలో కావాలంటే హెచ్‌పీ, లెనోవో, అసుస్ కంపెనీల‌కు చెందిన ల్యాప్‌టాప్‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

8. ర్యామ్
ల్యాప్‌టాప్‌ల ర్యామ్ క‌నీసం 4జీబీ ఉంటే చాలు. సాధార‌ణ యూసేజ్‌కు ఈ ర్యామ్ స‌రిపోతుంది. గ్రాఫిక్స్‌, ఎడిటింగ్‌, గేమ్స్ కోస‌మైతే 16 జీబీ ర్యామ్ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version