ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ స్థానానికి, తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ముందు సాగర్ విషయానికి వస్తే :
సాగర్ ఉప ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఉండగా… వాటిలో 108 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునేలా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5535 మంది పోలింగ్ సిబ్బంది, 4 వేల మంది పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తిరుపతి ఉప ఎన్నిక :
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎన్నిక జరగనుంది. నెల్లూరు జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 2,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 28 మంది పోటీలో ఉన్నారు. 10,850 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 23 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు మూడు కంపెనీల స్పెషల్ టీమ్ లు రంగంలోకి గిగాయి. పార్లమెంటు పరిధిలో 877 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ భద్రత కోసం కేంద్ర బలగాలు మోహరించాయి. ఇక మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.