డివైన్ పాలిటిక్స్ పై రజనీకాంత్ నిలబడగలరా ?

-

పాలిటిక్స్… ఇది అచ్చం యుద్ధరంగమే.. కాకుంటే నేరుగా ఆయుధాలు ప్రయోగించరంతే.. కానీ మత్తెక్కించే మాటల విన్యాసాలు.. మాయచేసే బూటకపు ప్రకటనలు.. విద్వేషాన్ని రెచ్చగొట్టే కుతంత్రాలు.. వీటన్నింటినీ తట్టుకుని నిలబడితేనే కిరీటం దక్కేది. అందుకే రాజకీయమంటే… వ్యూహాత్మక యుద్ధమని చెప్పాలి. మరి ఇలాంటి రాజకీయపు మాయతెరల్ని దాటుకుని…రజినీ ముందుకెళ్లగలరా..? ఇప్పుడిదే రాజకీయ పండితులను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.


సినిమాల్లో లాగే రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు రజినీ. కొత్తగా డివైన్ పాలిటిక్స్ అన్న పదం తెరపైకి తెచ్చారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, హింస, కుల, మత విద్వేషాలు పాతుకుపోయిన కలుషిత రాజకీయాల్లో .. డివైన్ పాలిటిక్స్ సాధ్యం కాదంటున్నారు రాజకీయ పండితులు. హీరోయిజం చూపించేందుకు….ఇది సినిమా కాదని , రాజకీయమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలంటున్నారు. పార్టీ పెట్టేందుకే దశాబ్దాలు వెయిట్ చేసిన.. రజినీ రాజకీయ రణతంత్రపుటెత్తులను ఎదుర్కొని నిలబడడం కష్టమనే వాదనా ఉంది…

ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. ఓటు కోసం నోట్లకట్టలు వెదజల్లుతున్నారు. సామదాన బేధ దండోపాయాలను ప్రదర్శిస్తారు. కులం, మతం ప్రస్తావన తెచ్చి జనాల్ని నిలువునా చీలుస్తున్నారు. తాయిలాలిస్తూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతగా మకిలిపట్టిన రాజకీయాన్ని తాను శుభ్రం చేస్తానంటున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్. డిసెంబర్31న తాను పెట్టబోయే పార్టీ ద్వారా.. అవినీతిరహిత, నీతివంతమైన, పారదర్శకత కలిగిన ఆధ్యాత్మిక రాజకీయం చేస్తానంటున్నాడు. దీనిద్వారా రాష్ట్రంలో ఉన్న రాజకీయపు ముఖచిత్రాన్ని పూర్తిస్థాయిలో మార్చేస్తానంటున్నాడు తలైవా.

రాజకీయాలు, ఆధ్యాత్మికత రెండూ రైలు పట్టాల లాంటివి. అవి ఎన్నడూ కలిసే ప్రసక్తే లేదు. మరి ఆ రెండింటినీ కలిపి చూపిస్తానంటున్నాడు రజినీ కాంత్. కాసులు, పదవుల కోసం కొట్టుకు చచ్చే రాజకీయ నాయకులు ఉన్న ఈ దేశంలో.. ఆధ్యాత్మిక రాజకీయాలు అమలు చేయడం ఎలా సాధ్యమవుతుంది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆయన పార్టీని నిర్మాణం చేయగలడా..? పార్టీ పెట్టినా ప్రస్తుత కాలంలో ఫండింగ్ లేకుండా ఎలా నిర్వహణ సాధ్యమవుతుంది..ఆ కాసులు కావాలంటే అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితి. మరివీటన్నింటినీ కాదని.. రజినీకాంత్ ఎలా సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేయగలరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రాజకీయాల్లో గుండె ధైర్యం అధికంగా ఉండాలి. అప్పుడే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని, వాటిని కచ్చితంగా అమలు చేయగలుగుతారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఎంజీఆర్, జయలలితలు. పురచ్చితలైవి అయితే… ప్రత్యర్థులకు సింహస్వప్నం.. మేరునగదీరుడు లాంటి కరుణానిధిని సమర్ధంగా ఎదుర్కొని, సీఎం పీఠం అధిష్టించారు. ఆమెలోని ధైర్యంలో పదోవంతు కూడా రజినీకాంత్‌లో కనిపించదు. పైగా ఆయనలో ఆధ్యాత్మిక వాది .. అప్పుడప్పుడు తొంగి చూస్తుంటాడు. రాజకీయాల్లో మానవీయ కోణమనేది లేదు. అధికారమే పరమావధిగా పార్టీలు ముందుకెళ్తాయి. అలాంటిది ఆధ్యాత్మిక రాజకీయం అన్నపదం ఎలా వర్కవుట్ అవుతుందన్నది రాజనీతివేత్తల సూటి ప్రశ్న.

ఓవైపు దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలను చూడాలని రాజకీయ జైత్రయాత్ర చేస్తున్న బీజేపీకి .. మరో ముఖంగా రజినీకాంత్‌ను విమర్శకులు అభివర్ణిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇటీవలి కాలంలో రజినీ.. సంఘ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొన్నిసందర్భాల్లో బీజేపీ హైకమాండ్ నేతలను పొగడడం జరిగింది. రాజకీయాల్లోకి దిగిన తర్వాత అన్ని పార్టీలతో పాటు బీజేపీపై కత్తిదూయాలి.. మరి రజినీ అంతధైర్యం చేయగలరా..? అసలు రజినీ ఒంటరిగా పోటీ చేస్తారా..? వేరేపార్టీతో పొత్తుపెట్టుకుంటారా..?

రజినీకాంత్‌ హీరోగా సూపర్ స్టార్ కావచ్చు కానీ..రాజకీయంగా మాత్రం స్పష్టత లేని వ్యక్తిగా కనిపిస్తారు. సినిమాల్లో అయితే బుల్లెట్‌కు ,బుల్లెట్ కు మధ్య హీరో పరుగుపెట్టేస్తాడు. అంతేనా బుల్లెట్లతో ఆటలాడుతాడు. వంద బుల్లెట్‌ దెబ్బలు తగిలినా లేచి నిలబడతాడు. కానీ ఇది రాజకీయం. ఇక్కడ ఏదీ అంత సులభంగా సాధ్యంకాదు. సరైన ప్రణాళిక లేకుంటే కిందపడటం ఖాయం. ఓసారి కిందపడితే రాజకీయాల్లో మళ్లీ పైకి లేవలేక చతికిల పడ్డ స్టార్ హీరోలెందరో మనకు ప్రత్యక్ష ఉదాహరణలకు కనిపిస్తూనే ఉన్నారు. మరి రజినీ పార్టీ రాజకీయంగా ఎలాంటి సంచలనాలు సృష్టించనుంది? అభిమానుల ఆకాంక్షలను నిలబెట్టుకుంటుందా.. రాజకీయ రంగాన్ని మార్చగలుగుతుందా.. వీటికి వచ్చే ఎన్నికలే సమాధానం చెబుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version