పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పురపోరుపై దృష్టిపెట్టాయి ఏపీలోని రాజకీయ పార్టీలు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఒక ఎత్తు అయితే.. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల ఎన్నికలు మరోఎత్తు. మూడు రాజధానుల అంశంతో ముడిపడి ఉండటంతో ఇక్కడి ప్రజా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు రాజధానులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో రెండు చోట్ల కేడర్ బలంగా ఉన్న లీడర్ల సమస్య టీడీపీని టెన్షన్ పెడుతుందట..
అమరావతి రాజధాని పై కట్టుబడి ఉన్న టీడీపీకి ఈ రెండుచోట్ల ఎన్నికలు చాలా కీలకం. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్న అధికారపక్షం వైసీపీ తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఈ రెండు చోట్లా వైసీపీ పాగా వేయలేకపోతే.. రాజధాని తరలింపే కారణమనే ప్రచారం మొదలవుతుంది. అదే సమయంలో టీడీపీ గెలుచుకోలేకపోతే అమరావతి ప్రభావం లేదనే వాదన వినిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రెండు పార్టీలకు ఇవి కీలకంగా మారాయి. నాయకత్వ లోపం ఈ మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీకి సవాల్ గా మారింది.
విజయవాడలో నాయకుల కొరత లేకున్నా అక్కడ వర్గపోరు పతాకస్థాయికి చేరుకుంది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే మూడు నియోజవకర్గలకుగాను సెంట్రల్, తూర్పులలో గట్టి నాయకత్వం ఉంది. పశ్చిమ నియోజకవర్గ వ్యవహారాన్ని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చూస్తున్నారు. బెజవాడలో టీడీపీ నాయకులంతా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. దీంతో పక్కా వ్యూహాలతో ఎన్నికలకు సిద్దమవుతున్న వైసీపీ కి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో వర్గపోరు ముందు దెబ్బతీసేలా ఉందన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుంది.
ఇక గుంటూరు విషయానికి వస్తే పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీనుంచి గెలిచి సీఎం జగన్‌కు జైకొట్టారు. గుంటూరు తూర్పులో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో మేయర్ ఎన్నికల్లో టీడీపీని ఎవరు లీడ్ చెయ్యాలో తెలియడం లేదట. ఎమ్మెల్యే మద్దాలికి ఈ ఎన్నిక పెద్దపరీక్షగా నిలవబోతోంది. వైసీపీ అభ్యర్థులను గెలిపించలేకపోతే అధికారపార్టీలో ఆయన ఇబ్బంది పడతారు. అందుకే ముందునుంచీ కసరత్తు మొదలుపెట్టారు గిరి. ఇక టీడీపీ కోవెలమూడి నాని అనే నేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది అంతుబట్టడం లేదు.
ప్రచారానికి చంద్రబాబు సై అంటున్నా ముందుగా పార్టీని గాడిలో పెట్టకుండా ఆయన ప్రచారానికి వచ్చినా ఫలితం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.