ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల మీద కేంద్రం కొరడా ఝులిపించింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్ నిషేధానికి చర్యలు చేపట్టింది. ఫేక్ న్యూస్ కట్టడికి చర్యలు తీసుకుంటూ కొన్ని నిభందనలు ప్రకటించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లాంటి సంస్థలు భారత్‌లో కచ్చితంగా అధికారులను నియమించాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా సంస్థలు భారత్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని పేర్కొంది.
చట్టాలు పాటించేలా చర్యలు తీసుకునే అధికారులు ఖచ్చితంగా భారత్ లోనే ఉండాలని కూడా కేంద్రం ఆదేశించింది. అలానే అసత్య, దుష్ప్రచారాలను అడ్డుకునేలా నియంత్రణ తెస్తామని తెలిపింది కేంద్రం. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం మోపేదిశగా అడుగులు వేసింది. కొత్తగా మూడు నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఆడవారిని తప్పుగా చిత్రీకరిస్తూ ఏవైనా ఫోటోలను అప్‌లోడ్ చేస్తే.. వారు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆ ఫోటోలను, సందేశాలను తొలగించాలని స్పష్టం చేసింది. డిజిటల్ న్యూస్ పోర్టల్స్ తమ వివరాలు బయట పెట్టాలని, ఆ తర్వాత డిజిటల్ న్యూస్ పోర్టల్ “ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” పరిధిలోకి తీసుకు వస్తామని కేంద్రం పేర్కొంది.