జమ్మూ కాశ్మీర్‌లోని మరోసారి విషాదం చోటు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి వేగంగా వస్తున్న ఓ కారు చీనాబ్ నదిలో పడిపోవడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు చీనాబ్ నదిలో పడిపోవడంతో మృతుల జాడ కోసం గాలిస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. చీనాబ్ నదిలో పడిన కారులోని నలుగురు వ్యక్తులు మరణించారని మెజిస్ట్రేట్ అథర్ అమీన్ జర్గర్ పేర్కొన్నారు. నలుగురు వ్యక్తులతో వెళుతున్న ఒక ప్రైవేట్ కారు ప్రమాదవశాత్తు థాత్రి, ప్రేమ్ నగర్ మధ్య షిబ్నోట్ వద్ద చీనాబ్ నదిలో పడిపోయిందని, మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తన్నామని జమ్మూకశ్మీర్ దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ పాల్ మహాజన్ వెల్లడించారు.
మరో ఘటనలో మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని హంద్వారాలోని వాటిన్ ప్రాంతంలో ప్రయాణికులను తీసుకువెళుతున్న వాహనం ప్రమాదానికి గురవడంతో 20 మంది గాయపడ్డారు.శనివారం రాత్రి గుల్‌మార్గ్-బూటపత్రి రహదారిపై మంచు కురిసిన తరువాత, కఠినమైన డ్రైవింగ్ సూచనలు ప్రకటించినప్పటికీ అతివేగం కారణంగా ఆదివారం నాగిన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు ఆర్మీ తెలిపింది. గాయపడిన వారిని సైనికులు ఆసుపత్రికి తరలించారు.