ఏపీ పునర్విభజనలో భాగంగా తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లను కేంద్రం ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఈనెల 9న డివోపిటీ ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీచేసింది.అయితే, తాము తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, సృజనలు క్యాట్‌ను ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఊరట దక్కలేదు. డివోపిటీ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.
దీంతో ఈ అధికారులంతా బుధవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ తీర్పు పై స్టే ఇవ్వాలని, తెలంగాణలోనే తమను కొనసాగించే విధంగా చూడాలని కోరిన IAS అధికారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఐఏఎస్‌లు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ వెల్లడించింది.