పారిస్‌లో చదదువుతున్న తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పట్ల సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందించింది. దీంతో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ మేరకు జగన్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో పారిస్‌లో చదువుతున్న కుమార్తె విద్యాభ్యాసం పూర్తి కాగా… కళాశాల స్నాతకోత్సవానికి రావాలంటూ జగన్‌ను ఆయన కుమార్తె ఆహ్వానించారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులు సీబీఐ కోర్టులో విచారణ దశలో ఉండగా…విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి జగన్‌కు తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో తన కుమార్తె స్నాతకోత్సవానికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవలే జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఓ దఫా విచారణ సాగగా… జగన్‌ను విదేశీ పర్యటనకు అనుమతించరాదని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. జగన్ విదేశాలకు వెళితే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ వాదించింది. తాజాగా బుధవారం నాటి విచారణలో సీబీఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతించింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో పర్యటించేందుకు జగన్‌కు కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే పారిస్ పర్యటన వివరాలను సీబీఐ అధికారులతో పాటు కోర్టుకు కూడా సమర్పించాలని జగన్‌ను కోర్టు ఆదేశించడం గమనార్హం.