ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమంచిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, గతంలోనూ ఇదే కేసు విషయంలో సీబీఐ విచారణకు హాజరు అయ్యారు. సీఆర్‌పీ 41(ఏ) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
విజయవాడలోని సీబీఐ కార్యాలయానికి బుధవారం ఉదయం 10:30 గంటలకు రావాలని నోటీసులో వెల్లడించారు. అయితే గతేడాది సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థను కించపరిచేలా ఆమంచి పోస్టులు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అతడిపై కేసు నమోదు చేసింది. కాగా, వైసీపీకి చెందిన ఆమంచి కృష్ణ మోహన్ గతంలో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.