రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు 73373-59375 నెంబర్ తో వాట్సాప్ సేవలు తీసుకువచ్చినట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతుల సమయం వృథా కాకుండా.. సదరు నెంబర్ కు Hi అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుంది. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత… రైతు పేరును ధృవీకరించాలి. అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి.
ఆ తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి మూడు ఆప్షన్లుంటాయి. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలి. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది నమోదు చేయాలి. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం.