కేంద్ర సర్కార్ వరుసగా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈడీ, సీఐడీ, సీబీఐ అధికారులను ఉసిగొల్పుతూ తమ గొంతులు మూయించాలని చూస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై వరుసగా ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
ఇప్పటికే దీదీ కేబినెట్‌లో ఓ మంత్రి పదవి కోల్పోయారు. మరో ఎమ్మెల్యే ఇంటిపై సీబీఐ దాడులు జరిపింది. ఇప్పుడు తాజాగా న్యాయశాఖ మంత్రిని సీబీఐ టార్గెట్ చేసింది. పాఠశాల ఉద్యోగాల నియామక కుంభకోణంలో అరెస్టై పార్థా ఛటర్జీ మంత్రి పదవి కోల్పోగా… చిట్‌ఫండ్ స్కామ్‌లో ఎమ్మెల్యే సుబోధ్ అధికారి ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘఠక్ నివాసాలపై సీబీఐ దాడులు చేసింది. అసన్‌సోల్‌లోని ఘఠక్‌కు చెందిన 3 నివాసాలతోపాటు, కోల్‌కతాలోని 4 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పాత్రపై విచారణ జరిపేందుకు ఈ తనిఖీలు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. తనిఖీల వేళ నివాసాల వద్ద భారీగా కేంద్ర ప్రభుత్వ బలగాలను మోహరించారు. సోదాలు జరుగుతున్న సమయంలో ఘఠక్ ఇంట్లో లేరని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది.