తెలంగాణలో జరిగిన దిశా సామూహిక అత్యాచారం మరియు హత్య సంఘటన దేశవ్యాప్తంగా అందరిలో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తగా దిశా బిల్లును తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మరియు శాసనమండలి నుండి ఆమోదం పొందిన తరువాత, బిల్లును చట్టంగా మార్చడానికి కేంద్రానికి బిల్లు పంపబడింది.
అయితే దిశా బిల్లులో కొన్ని అవసరమైన సవరణలు చేయాలని, బిల్లును చట్టంగా మారాలంటే ఆ సవరణలు చేసి తిరిగి పంపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్రం ఇప్పుడు దిశా బిల్లును వెనక్కు పంపింది. ఈ బిల్లుపై కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి, బిల్లులో మరికొన్ని మార్పులు చేయాలని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలే నిజం అయితే కీలకమైన దిశా బిల్లుచట్టం గా మారేందుకు మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.