ఏపీలో గడిచిన 20 రోజులుగా రాజధాని పరిణామాలు తీవ్ర వేడి పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం మూడు రాజధా నుల వైపే మొగ్గు చూపుతుండడం, కాదు.. ఇప్పటికే అమరావతిని రాజధానిగా ప్రకటించాం కాబట్టి.. దానినే కొనసాగించాలని విపక్షాలు.. దీనికి రైతుల నుంచి వస్తున్న ఆందోళనలతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయంలో ఎలా స్పందిస్తాయనే విషయం ఆసక్తిగా మారింది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయిన నేపథ్యంలో ఏపీలో బీజేపీ నేతలు తలకో రకంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం చూస్తూ.. ఊరుకోదని ఒక నాయకుడు అన్నారు.
మరో నాయకుడు మరో నాలుగు అడుగులుముందుకు వేసి అంగుళం కూడా రాజధానిని కదిలించేందుకు కేంద్రం ఇష్టపడదని చెప్పారు. రాజధానిని కదిలిస్తే. కేంద్రం ఎట్టి పరిస్థితిలోనూ జగన్‌పై చర్యలు తీసు కుంటుందని అన్నారు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన బీజేపీ జాతీయ నాయకుడు కేంద్రానికి, రాజధా నికి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత కేంద్రం ఎలా స్పందిస్తుంది? ఏవిధంగా రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. దీనికి కలిసి వస్తున్న అంశం.. ప్రధాని మోడీ రాజధానికి స్వయం గా వచ్చి శంకుస్థాపన చేయడమే. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు కేంద్రం ఏపీ వ్యవహారాలపై దృష్టి పెట్టింది. అక్కడ ఏం జరుగుతోంది? పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం ఏంటి? అనే అంశాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు విషయం సేకరించారు.
దీనిని బట్టి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు సమానంగా అందేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని, దీనికి సంబంధించి రెండు కమిటీల ద్వారా పరిస్థితిని తెప్పించుకుని అధ్యయనం చేస్తోందని కేంద్రానికి సమాచారం అందింది. దీంతో కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని , రాజదాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కనుక మనం ప్రమేయం కూడదని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా సమర్ధించినట్టు సమాచారం.