దేశ రక్షణలో భాగంగా కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాయుసేన కోసం 6,828 కోట్ల వ్యయంతో 70 HTT-40 సాధారణ శిక్షణ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్షణా యుద్ధ విమానాలు.. వాయుసేనకు ఆరేళ్లలో అందుతాయని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
మెరుగైన శిక్షణకు ఉపయోగపడే ఈ యుద్ధ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఈ నిర్ణయం వల్ల M.S.M.E.లకు కొత్త అవకాశాలు లభించటంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబనను బలోపేతం చేసే ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. కొత్తగా చేరిన పైలెట్లకు శిక్షణ యుద్ధవిమానాల కొరత తీరుతుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ వెల్లడించారు.
మరోవైపు చైనాతో ఉన్న వాస్తవాధీనరేఖ వెంబడి సైన్యం బలోపేతమే లక్ష్యంగా.. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌కి కొత్తగా ఏడు బెటాలియన్లు మంజూరు చేసింది. ఈ 7 కొత్త బెటాలియన్లలో 9,400 మందిని నియమించనున్నామని తెలిపింది. నూతనంగా నియమించనున్న ఐటీబీపీ సిబ్బందిని 47 కొత్త సరిహద్దు పోస్టుల్లో, 12 స్టేజింగ్ క్యాంప్‌లలో ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించింది.