బొగ్గు గనులు ఎవరికి కేటాయింపుల విషయంపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి క్లారిటీ ఇచ్చారు. బొగ్గు గనులు ఎవరికి కేటాయించాలనే విషయంలో కేంద్రం రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించలేదని వెల్లడించారు.
బొగ్గు గనుల కేటాయింపుపై ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 70 బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అలాగే బొగ్గు గని విశ్రాంత కార్మికుల పింఛను పెంపు విషయంలో 12వ వేతన సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని పింఛను పథకాన్ని పునఃసమీక్షించేందుకు తాము సూత్రప్రాయంగా అంగీకరించినా.. కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధుల ప్రతిఘటనతో ఏకాభిప్రాయం రాలేదని మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.