కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న మహమ్మారి. గత డిసెంబర్ చైనాలోని వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే దేశదేశాలు వ్యాపించింది. ఈ రక్కసిని మట్టుపెట్టడానికి చేతిలో ఆయుధం లేకున్నా అన్ని దేశాలు అలుపెరుగని పోరాటాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కఠినమైన ఆంక్షలు విధించినా మరణాల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యాలు విలవిల్లాడుతున్నాయి. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న వేళ ఇక్కడ చాలా మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు శుభవార్త అందించింది. గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్ ను ఉపయోగించే వినియోదారులకు రాబోయే మూడు నెలల్లో 8 సిలిండర్లను ఫ్రీగా అందివ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో ఎనిమిది కొట్ట మంది లబ్ది పొందనున్నారు.
కాగా, లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో 14.2 కిలోల సిలిండర్లు ఉపయోగించే పీఎంయూవై లబ్దిదారులకు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో 14.2 కేజీల సిలిండర్లు వాడే వారికి మూడు మరియు 5కేజీల సిలిండర్లు వాడే వారికి 8 చొప్పున క్రేంద్రం ఇవ్వనుంది. ఇక మూడు నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఇస్తారు. అలాగే లాక్ డౌన్ అయినప్పటి నుండి, దేశంలో రోజుకు 50 నుండి 60 లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని కూడా గుర్తుచేశారు.