ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోండి : కేంద్రం

-

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మిమాన సర్వీసులపై వారం రోజుల పాటు ఆంక్షలు విధించడంతో పాటు దేశంలో రైళ్లను మార్చి 31 వరకు రద్దుచేసింది. తాజాగా రాష్ట్రాలు అన్నీ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్ విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు లాక్‌డౌన్ అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ పట్ల నిర్లక్ష్యం వద్దని ట్విట్టర్ వేదికగా ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు విధిగా సామాజిక దూరాన్ని పాటించాలని మోదీ కోరారు. అలాగే ఆదివారం జనతా కర్ఫ్యూ రోజున కనబరిచిన స్ఫూర్తినే లాక్‌డౌన్ సమయంలోనూ చూపించాలని పలువురు రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలను కోరుతున్నారు.

కాగా, ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 415 మందికి కరోనా సోకిందని, అందులో 7 మంది మృతిచెందారని తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మార్చి 31వరకు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version