విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం గుడ్ న్యూస్

-

కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో విదేశాల్లో ఉన్న చాలా మంది స్వదేశాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. లాక్ డౌన్‌లో భాగంగా భారత్‌లో విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పులవురు భారతీయులు కూడా విదేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో విదేశాల్లో చిక్కుకున్న పలువురు భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను ఆదుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ 3.0 లో పలు సడలింపులు ప్రకటించిన కేంద్రం.. విదేశాల నుంచి స్వదేశానికి రావాలనుకుంటున్న భారతీయుల విషయంలో  కీలక నిర్ణయం తీసుకుంది. మే 7 నుంచి దశల వారీగా వారిని ఇండియాకు తీసుకురానున్నట్టుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఉన్నత విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి విమానాలు, నౌకలు నడపనున్నట్ట కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దశలవారీగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపింది. స్వదేశానికి వచ్చే భారతీయులు ప్రయాణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రయాణానికి ముందు ప్రతి ఒక్కరికి మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించి.. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతించనున్నట్టు వెల్లడించింది. అలాగే ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ, విమానయాన శాఖ జారీచేసిన నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించింది.

ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్ కూడా సిద్ధం చేసినట్టు కేంద్రం తెలిపింది. భారత ఎంబసీలు, హై కమిషన్ కార్యాలయాలు.. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల జాబితాను సిద్ధం చేస్తున్నాయని చెప్పింది. మే 7 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు పేర్కొంది. భారత్ చేరకున్నాక ప్రతి ఒక్కరు మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతి ఒక్కరికి మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించాక.. వారిని 14 రోజులపాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచడం జరుగుతుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version