తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా బుధవారం ఉదయం భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైంది. ములుగు జిల్లా కేంద్రంగా స్వల్ప భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రకంపనలు గోదావరి నది పరివాహ ప్రాంతాల్లోనే అధిక తీవ్రత చూపినట్లు సమాచారం.
భూకంపంపై తాజాగా NGRI శాస్త్రవేత్త శేఖర్ స్పందించారు. రానున్న రోజుల్లో మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. నేడు వచ్చిన ప్రకంపనలతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. ఎవరైనా పాత భవనాలు, పగుళ్లు పట్టిన ఇళ్లలో ఉంటే వెంటనే ఖాళీ చేయడం మంచిదని.. లేదంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.