రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు విషయం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఏపీ ప్రజలకు జల జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో.. రాష్ట్ర ప్రభుత్వం కన్నా కూడా ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాజాగా జాతీయ పత్రికలు కూడా దీనిని ప్రముఖంగా ప్రచురించారు. ఎప్పుడో 2013-14లో చేసిన అంచనాలనే ఇప్పుడు కూడా అమలు చేస్తామని.. అప్పట్లో పేర్కొన్న 29 వేల కోట్ల మేరకే ప్రాజె్క్టును కట్టుకోండని.. ఇంతకు మించి మేం ఇచ్చేది లేదని కేంద్రం దాదాపు కుండబద్దలు కొట్టేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు ద్వారా లబ్ది పొందే.. కోస్తా, రాయలసీమ జిల్లాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న ఉన్న ధరలు నేడు లేవు. అలాంటిది ఎప్పుడో ఏడేళ్ల కిందట అంచనాలను ఇప్పటికీ అమలు చేస్తారా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కారు కూడా కేంద్రానికి తాజాగా ప్లీజ్.. ప్లీజ్.. అంటూనే ఘాటుగా లేఖ రాసింది. రేపో మాపో.. దీనిపై ఉద్యమాలకు రైతు సంఘాల నేతలు కూడా రెడీ అవుతున్నారు. అయితే, ఇంత జరుగుతున్నా.. ఇదే ప్రాజెక్టును కీలకంగా భావించిన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు మౌనం పాటించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. బాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రాజెక్టును కీలకంగా తీసుకుని .. ప్రతి సోమవారాన్ని పోలవారం చేసుకుని ముందుకు సాగారు.
ఎట్టి పరిస్థితిలోనూ 2018 చివరి నాటికి పూర్తి చేసి.. ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తామన్నారు. అయితే, ఇది సాకారం కాలేదు. ఇక, ఇప్పుడు కేంద్ర మరిన్ని మెలికలు పెట్టింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన వాయిస్ ఎందుకు వినిపించలేక పోతున్నారు. 55 వేల కోట్ల అంచనా ఆయన హయాంలోనే పెరిగింది. అలాంటప్పుడు.. దీని వెనుక ఉన్న చరిత్రను వివరించే బాధ్యత ఖచ్చితంగా ఆయనపై ఉంటుంది. అంతేకాదు, దీనిపై ప్రజల్లోకి వెళ్లి.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసేందుకు.. పార్టీని నిలెబట్టుకునేందుకు కూడా మంచి అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు స్పందించలేదు. కుదిరితే.. జగన్‌ను తిడుతున్నారు తప్ప.. ప్రాజెక్టు విషయంలో స్పందించడం లేదు. మరి ఏమైనా.. ఆయన తప్పులు బయటపడతాయని అనుకుంటున్నారా ? ఆ భయం ఆయనకు ఉందా ? అనే సందేహాలు తెరమీదికి రావడం గమనార్హం. మరి ఇప్పటికైనా బాబు పెదవి విప్పితే.. అటు ఆయన పార్టీకి, ఇటు ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, అప్పుడు జగన్ ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపించినట్టు కూడా అవుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ఏం చేస్తారో.. ఎప్పుడు పెదవి విప్పుతారో చూడాలి.