క‌ర్నూలు జిల్లాలో నేడు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. అడ్డుకుంటామన్న జేఏసీ

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజునుంచి మూడురోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుంది. ఈ క్ర‌మంలోనే సోమవారం ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్‌ సరిహద్దులోని పుల్లూర్‌ టోల్‌ ప్లాజా దగ్గరకు చేరుకుంటారు. అక్కడ నుంచి బైక్‌ ర్యాలీలతో కర్నూల్ జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు. అనంతరం కర్నూలులోని పీజేఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ముఖ్యనేతలంతా హాజరవుతారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక్కో నియోజకవర్గానికి చెందిన ఇంచార్జిలు, పార్టీ కీలకనాయకులతో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలను సేకరిస్తారు. తొలిరోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడతారు. మ‌రోవైపు చంద్రబాబు కర్నూలు పర్యటన గురించి తెలిసిన రాయలసీమ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లాకు చంద్రబాబు రావొద్దంటూ టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. దీంతో కర్నూలు లో గతి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.