ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన అభిమాన మీడియా అవకాశం వచ్చినప్పుడల్లా మోసేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన ఇదే పంథాలో కొనసాగుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి విషయాన్ని లేవనెత్తాలో.. ఎక్కడ, ఎలాంటి విషయాన్ని తొక్కిపట్టాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియని ఇప్పుడు సోషల్ మీడియా జనాలు అంటున్నారు. కొన్ని రోజుల కిందట అసెంబ్లీలో సీఎం జగన్ ఒక బిల్లును స్వయంగా ప్రవేశ పెట్టారు.
అదే.. ఏపీ శాసన మండలి రద్దు బిల్లు. దీనిపై సుధీర్ఘంగా రోజురోజంతా చర్చించారు. అయితే, ఈ సభకు చంద్రబాబు ఆయన 20 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. నిజానికి గతంలో జగన్ అసెంబ్లీని బాయ్‌కాట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం అంటే విలువ తెలిసిన నాయకుడు ఎవరూ కూడా అసెంబ్లీ వేదికను వదులుకోరని చంద్రబాబు సూక్తులు చెప్పారు. కానీ, మండలిపై చర్చ సందర్భంగా మాత్రం ఆయనకు సూక్తి గుర్తుకు రాలేదు. ఆయనతో పాటు పరివారం కూడా అసెంబ్లీని ఆరోజు బాయ్‌కాట్ చేసి.. మీడియా ముందుకు వచ్చారు. దీనికి రీజన్ అందరికీ తెలిసిందే.
అదే రోజు అసెంబ్లీకి వెళ్లి ఉంటే.. గతంలో తాను మండలిపై చేసిన వ్యతిరేకప్రసంగం ప్రత్యక్షంగా వినాల్సి వస్తుందని బాబు జంకిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఎప్పుడు ఎక్కడ తప్పించుకోవాలో బాగా తెలిసిన చంద్రబాబు.. తాజాగా కూడా కీలక మైన ఓ విషయంపై అంతే సునాయాసంగా తప్పించుకున్నారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌పై ఏపీలో ఇంకా చర్చ జరుగుతోంది. ఏపీకి మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటా యించలేదు. కీలకమైన ప్రాజెక్టులకు కూడా ప్రతిపాదనలు వెల్లడించలేదు.
ఇక, పోలవరం, రాజధాని నిర్మాణ నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. రైల్వే ప్రాజెక్టులపై పన్నెత్తు మాట కూడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ విషయంపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారని అందరూ చర్చించుకున్నారు.
అయితే, చంద్రబాబు మాత్రం కేంద్ర బడ్జెట్‌పై ఒక్క ముక్కకూడా మాట్లాడలేదు. అంతేకాదు, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఎంతో మంది మేధావులు ఏపీకి అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, చంద్రబాబు మాత్రం కనీసం ఒక్కమాట కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అనడం కానీ, బడ్జెట్‌పై తన అభిప్రాయం చెప్పడం కానీ చేయలేదు. పైగా, బడ్జెట్ తదుపరి రోజు.. మీడియా ముందుకు వచ్చిన ఆయన మూడు గంటల పాటు మీడియాతో మాట్లాడారు.
జగన్ ప్రభుత్వాన్ని ఏకేస్తూనే గతంలో తాను ప్రజలకు, రాష్ట్రానికి ఏం చేసింది… తద్వారా ఈ దేశానికి ఏం ఒరిగింది అన్నీ చెప్పుకొచ్చారు. కానీ, బడ్జెట్‌లో ప్రస్తావించని హోదా గురించి ఒక్క ముక్కకూడా చెప్పలేదు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. ఈ రాష్ట్రం ఏమవుతుందని అనుకుంటున్నారనే ఆందోళనను కూడా వ్యక్తీకరించలేదు. దీంతో చంద్రబాబు వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీని అనేసాహసం ఇప్పుడు ఆయన చేయలేరని, ఇది ఎస్కేప్‌లో భాగమేనని అంటున్నారు పరిశీలకులు.