అయోధ్యలో రామమందిరంపై లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రామమందిర ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్‌కు కేంద మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని మోడీ చెప్పారు. భారీ స్థాయిలో రామ మందిరాన్ని నిర్మిస్తామనీ… అందుకు అవసరమైన ప్లాన్ కూడా ఇప్పటికే సిద్ధమైనట్టు ప్రధాని వెల్లడించారు. ట్రస్ట్ ఏర్పాటుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు.
అలాగే అయోధ్యలో మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని కోరారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు. ఇందుకు 130కోట్ల మంది భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. కాగా, రామమందిర నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటు చేసినట్టు ప్రకటించగానే లోక్‌సభలో బీజేపీ సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజులకు ముందే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.