రాష్ట్రంలో ఏదొక సమస్య రావడం దానిపై ప్రతిపక్షాలు పోరాటం చేయడం మామూలే. అయితే ఆ సమస్యల ద్వారా రాజకీయం చేసి అధికార పార్టీని దెబ్బకొట్టి లబ్ది పొందాలనేది ప్రతిపక్ష పార్టీల రాజకీయం. ఇక వారికి చెక్ పెట్టి, అసలు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని చెబుతూ రాజకీయం చేసి లబ్ది పొందాలని అధికార పార్టీ చూస్తోంది.
అయితే ఇంతకాలం ప్రతిపక్ష నేత చంద్రబాబు…జగన్ టార్గెట్‌గా రాజకీయం చేశారు. అలాగే జగన్ కూడా బాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేశారు. కానీ ఇప్పుడు రాజకీయం కాస్త మారింది. ఫీల్డ్ లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చారు. ఆయన ఈ మధ్య ప్రజా సమస్యలపై తీవ్రంగా గళం విప్పుతూ…జగన్‌ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
కాకపోతే మరో బలమైన పక్షంగా ఉన్న టీడీపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఇదే సమయంలో వైసీపీ నేతలు ఏమన్నా..పవన్‌కు కౌంటర్లు ఇవ్వాలని చూస్తే…పవన్‌కు టీడీపీ సపోర్ట్‌గా వచ్చేస్తుంది. ఇటు సేమ్ సీన్…బాబుకు పవన్ సపోర్ట్‌గా వచ్చేస్తున్నారు. అయితే తాజాగా సేమ్ సీన్ మళ్ళీ జరుగుతుంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పిన పవన్…కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేయకుండా రాష్ట్రంలోని వైసీపీపై విమర్శలు చేశారు. వైసీపీ పోరాటం చేయాలని, అలాగే అఖిలపక్షాన్ని వారం రోజుల లోపు ఢిల్లీకి తీసుకెళ్లాలని లేదంటే పోరాటాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు.
పవన్ ఇలా చెప్పిన వెంటనే…వైసీపీ నేతలు ఎటాక్ మొదలుపెట్టారు. బీజేపీపై పోరాటం చేయకుండా తమపై పోరాటం చేస్తే ఏం వస్తుందని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఇన్ని రోజులు గుడ్డి గుర్రం పళ్ళు తోమారా? అంటూ మంత్రి అప్పలరాజు ఫైర్ అయ్యారు. పవన్…చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ నేతల ఎటాక్ వెంటనే…టీడీపీ నేతలు పవన్‌కు సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు… జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే స్టీల్ ప్లాంట్‌పై రాజకీయం చేస్తూ జగన్‌ని టార్గెట్ చేసి బాబు-పవన్‌లు గేమ్ స్టార్ట్ చేశారని అర్ధమవుతుంది.