తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సమర్ధ నాయకత్వం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఉన్న నాయకులను కాపాడుకుంటూనే కొత్త నాయకుల కోసం పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తుంది. అయినా సరే ఆ కసరత్తులు పార్టీకి పెద్దగా ఫలించడం లేదు. అంతే కాదు ఉన్న నేతలను కాపాడుకోవడం అనేది ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారిపోయింది. ఎవరు ఉంటున్నారో, ఎవరు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి.
పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు. చంద్రబాబు మాటను లెక్క చేసే పరిస్థితి పెద్దగా కనపడటం లేదు. పార్టీకి ఎంత బలం క్షేత్ర స్థాయిలో ఉన్నా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడుని తట్టుకుని నిలబడటం అనేది పార్టీకి చాలా కష్టంగా మారింది అంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీలో ఇప్పుడు కనపడని అసంతృప్తి ఉంది అనేది జనాల మాట.
కొందరు సీనియర్ నేతలు చంద్రబాబు వైఖరితో ఇబ్బంది పడుతున్నారు. పార్టీ అధినేతగా చంద్రబాబు నిర్ణయాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి అనేది కొందరి మాట. ఈ నేపధ్యంలోనే ఒక కీలక నేత పార్టీ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత ఆయన. ఉత్తరాంధ్ర తో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆయనకు మంచి పట్టు౦ది పార్టీలో.
ఎందరో నాయకులకు సీట్లు ఇప్పించిన చరిత్ర కూడా ఆయన సొంతం. అయినా సరే పార్టీలో తనకు చికాకుగా ఉందని, తన ఆలోచనలకు విలువ లేదని, రాజధాని వ్యవహారంలో కనీసం తన సలహా తీసుకోలేదని చంద్రబాబు మీద అసహనంగా ఉన్నారట. త్వరలో బిజెపి తీర్ధం పుచ్చుకునే ఆలోచనలో ఉన్న సదరు నేతను ఇప్పుడు చంద్రబాబు బుజ్జగించే కార్యక్రమాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.