రాజధాని జిల్లా.. తాను అభివృద్ధి చేశాను.. తనకు తప్ప.. తన పార్టీకి తప్ప.. ఇక్కడి ప్రజలు ఎటు వైపు ఉంటారు! అని గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెప్పేవారు. “మేం వేయించిన రోడ్లు.. మే ఇచ్చిన నీళ్లు తాగుతున్నారు. మాకు తప్ప వేరే పార్టీకి ఓట్లెందుకు వేస్తారు“ అని గురజాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి జనాలు ఏమనుకున్నారో మనకు తెలిసిందే. ఇక్కడ కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ గెలిచింది. రేపల్లె, గుంటూరు వెస్ట్. వీటిలోనూ వెస్ట్ నుంచి గెలిచిన నాయకుడు వైఎస్సార్ సీపీకి జై కొట్టారు. ఇక, రేపల్లె నుంచి గెలిచిన నాయకుడు మౌనం వహిస్తున్నారు.
ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ కేవలం తన వ్యాపార వ్యవహారాలు మాత్రమే చూసుకుంటున్నారు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. పైకి మా త్రం చాలా బాగున్నట్టుగా అనిపిస్తున్నా.. అనేక నియోజకవర్గాల్లో ఓడిపోయిన నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే, వీరంతా పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఆలోచన చేస్తున్నారని చెప్పలేం. కానీ, వీరి వ్యవహార శైలితో కార్యకర్తలు నిలవడం లేదు. వైసీపీలోకి జంప్ అవుతున్నారు. ఇక, ఎస్సీ నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. అక్కడ కూడా వరుస పెట్టి గెలిచిన నాయకులు తాడికొండ, వేమూరుల్లో బయటకు రావడం లేదు.
మాజీ మంత్రుల్లో నక్కా ఆనంద బాబు ఒక్కరే అడపా దడపా బయటకు వస్తున్నారు. ఏవో నాలుగు కామెంట్లు చేసి మళ్లీ ఇంటికే పరిమితమ వుతున్నారు. ఇక, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. వినుకొండ, గురజాల, తెనాలి వంటి కీలక నియోకవర్గాల్లో బాబు సామాజిక వర్గానికే చెందిన నాయకులు ఉన్నప్పటికీ.. యాక్టివ్‌గా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. దీంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా.. పట్టుమని పదిమందిని పోగేసేందుకు నాయకులు అల్లాడుతున్నపరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. ఇలా మొత్తంగా గుంటూరులో పైకి బాగానే ఉందని అనిపిస్తున్నా.. వాస్తవానికి మాత్రం పార్టీ అవసాన దశకుచేరుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.