తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలకూ వ్యాప్తితం చేసిన మహా మనిషి నందమూరి తారక రామారావు. పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే కాదు కొన్ని నెలల్లోనే అధికారం దక్కించుకుని చరిత్ర సృష్టించడం ఆయనకే సాధ్యం. ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఇవాళ కష్ట కాలంలో ఉంది. బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఆ రోజు నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అమరావతి రాజధాని అంటూ ఆ రోజు చంద్రబాబు కొన్ని కలలను నిజం చేసే పనిలో పడ్డారు.
కానీ తరువాత వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఆయన అధికారం కోల్పోయారు. తరువాత రెండేళ్ల పాటు మహానాడు నిర్వహించలేదు. కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మహానాడు నిర్వహణకు సంబంధించి పూనిక వహించి రెండ్రోజుల సంరంభానికి నిన్నటి వేళ తెరతీశారు. ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న ఈ మహానాడులో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువరిస్తూ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. పార్టీకి సంబంధించి సంస్థాగత పదవుల విషయమై కానీ లేదా ప్రభుత్వ విధానాలు విమర్శించే విషయమై కానీ చంద్రబాబు కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడించారు.
క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదాన్ని వినిపించారు. ఇప్పుడంతా దీనిపైనే చర్చ సాగుతోంది. క్విట్ జగన్ అన్నది సాధ్యమా ? ఓ సారి చూద్దాం.
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకూ విపక్ష కూటములతో పోరాడిన వారే ! ఆ రోజు కాంగ్రెస్ తో ఢీ కొన్న వారిలో మామా అల్లుళ్లు ఇద్దరూ ఉంటారు. అటుపై వైసీపీ ఏర్పాటయ్యాక టీడీపీకి కొత్త శత్రువులు పుట్టుకువచ్చారు. వైసీపీ ఆవిర్భావం చెంది దాదాపు పదేళ్లు కావస్తోంది. ఓ విధంగా వైసీపీ అధికారం దక్కించుకున్నాక, టీడీపీ తప్పిదాలను జనంలోకి తీసుకువెళ్లడమే ఓ నిర్దేశిత లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ దశలో వైసీపీ కొంత సక్సెస్ అయింది. పాలనకు సంబంధించి విధానపర వైఫల్యాలు ఉన్నా, వాటిని అధిగమిస్తూ.. తెలుగుదేశంను మరోసారి ఓడించేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది.
ఈ దశలో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ ఓ వైపు, 23 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ మరోవైపు రాజకీయం నడుపుతున్నాయి. పాలన పరంగా తమని తాము సమర్థించుకుంటూ, సంక్షేమ పథకాలే తమ గెలుపునకు శ్రీరామ రక్ష అని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ఇదే సమయంలో టీడీపీ మాత్రం విభిన్న ధోరణిలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజా వ్యతిరేకతను తమకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల దూరం ఉంది. ఈ దశలో టీడీపీ నిర్వహిస్తోన్న మహానాడు అన్నది అత్యంత కీలకం కానుంది.
టీడీపీని బతికించుకోవడం అధినేతకో ధ్యేయం కానుంది. ఆ దిశగా చంద్రబాబు ఆ దిశగా లోకేశ్ బాబు వేస్తున్న అడుగులు మహానాడు తరువాత ఏ దిశగా వెళ్తాయో చూడాలిక. ఓ విధంగా ప్రజా వ్యతిరేకతపైనే నమ్మకాలు పెంచుకుని, వైసీపీతో టీడీపీ కొట్లాటకు దిగుతోంది. కానీ అదే సమయంలో పార్టీలో అంతర్గత ప్రజా స్వామ్యాన్ని పెంపొందించి, కాస్త కొత్త ముఖాలకు కూడా అవకాశాలు ఇస్తే పార్టీ బాగు పడుతుంది అన్న వాదన పరిశీలకుల నుంచి వస్తోంది. ఇక ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన్రోజు. 99 వ జయంతి. ఇక్కడి నుంచి శత జయంతి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏమన్నారో చూద్దాం…
ఎన్టీఆర్ చరిత్రను చూస్తే ఒక మనిషి తన జీవితంలో ఇన్ని సాధించగలడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీఆర్ గారిని సినీ రంగంలో వెండితెర వేలుపుగా, రాజకీయ రంగంలో పేదలపాలిట దేవుడిగా కొలిచారు ప్రజలు. రెండు రంగాల్లోనూ దైవత్వాన్ని కనబరిచిన అరుదైన చరిత్ర ఎన్టీఆర్ గారి సొంతం. దేశ రాజకీయాలలో సంక్షేమ శకానికి నాంది పలికి, సమ సమాజానికి బీజం వేసిన మహానుభావుడు ఎన్టీఆర్. ముఖ్యంగా తెలుగు జాతికి ఆ మహానుభావుడు చేసిన సేవలు చిరస్మరణీయం. అందుకు నివాళిగా సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను జరుపుకోవడానికి సంకల్పించాం. తెలుగు గడ్డపై తరతరాలు ఎన్టీఆర్ గురించి చెప్పుకునేలా, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగాలి. ఈరోజు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా ఆ ధన్య చరితుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.
– నారా చంద్రబాబు నాయుడు, అధినేత, తెలుగు దేశం పార్టీ