టీడీపీ నాయకులు వరుస పెట్టి జైలుకు వెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఇలా జరుగుతోందని, తమను వేధింపుల కు గురి చేస్తున్నారని టీడీపీ గగ్గోలు పెట్టి.. ప్రజల్లోకి తీసుకు వెళ్లింది. అయితే, ప్రజలు ఎవరూ కూడా దీనిని పట్టించుకోలేదు. దీం తో ఆయా నేతల అరెస్టులపై కులాల కార్డులను కూడా ప్రయోగించారు. అయినా కూడా ఇది సక్సెస్ కాలేదు. దీంతో టీడీపీ అంతర్మథనం చెందుతోంది. ప్రతిగా వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత, కుటుంబ సభ్యులపైనా తీవ్ర దుష్ప్రచారానికి తెరదీసింది. అదేసమయంలో రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు కూడా రెడీ అయింది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు .. అసలు టీడీపీ నేతలు ఎందుకుఅరెస్టు అయ్యారు? నిజానికి వారి తప్పులు ఏమీ లేకుండానే జగన్ సర్కారు వారిని జైలుకు పంపించిందా? అనే ప్రశ్నలు టీడీపీలోనే వస్తున్నాయి. నిజానికి ఇప్పటికి ముగ్గురు టీడీపీ నాయకులు అరెస్టయ్యారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలు ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. అయితే, వీరిలో అచ్చెన్నాయుడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఈఎస్ ఐ కుంభకోణానికి సంబంధించి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రాలు చేయించిన విచారణలో భాగంగా అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.
ఇక, కొల్లు రవీంద్ర అరెస్టు వెనుక హత్య ను ప్రోత్సహించారనే బలమైన సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. అదేవిధంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు వెనుక రవాణా వ్యవస్థను తప్పుదోవ పట్టించే చర్యలు ఉన్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి, సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించిన తీరుపై రవాణా అధికారుల ఫిర్యాదు మేరకు ఆయన అరెస్టయి.. జైలుకు వెళ్లారు. నిజానికి ఈ వ్యవహారాల వెనుక ఏం జరిగింది?.. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేస్తే.. చంద్రబాబు ఇచ్చిన మితిమీరిన స్వేఛ్చ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోందన్నది వాస్తవం అంటున్నారు టీడీపీలో ఓ వర్గం నాయకులు. అధికారంలో ఉండగా.. తర్వాత కూడా ఆయనకు నేతలపై పట్టులేక పోవడం వల్లే.. ఇలా జరిగిందని తేలింది. దీంతో చంద్రబాబు.. తప్పు తన దగ్గరే పెట్టుకుని వైసీపీపై ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.