స‌ర్వేల ప‌రువు తీస్తున్న చంద్ర‌బాబు.. తాజా స‌ర్వే ఏం చెప్పిందంటే…!

-

ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. స‌ర్వేల సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయిన దానికీ కాని దానికీ కూడా ఆయ‌న స‌ర్వేల పాట పాడారు. ప్ర‌జ‌లు త‌న‌పై ఏమ‌నుకుంటున్నారో.. స‌ర్వే.. త‌న ప్ర‌జాప్ర‌తినిధులు ఏం ప‌నులు చేస్తున్నారో స‌ర్వే.. త‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు ఎలా అందుతున్నాయో స‌ర్వే.. ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో స‌ర్వే.. సంతృప్త స్థాయిల‌పై స‌ర్వే.. ఇలా నిత్యం ఏదో ఒక స‌ర్వేల‌తో ఆయ‌న స‌ర్వే బాబుగా పేరు ప‌డ్డారు. చిత్రం ఏంటంటే.. అన్ని స‌ర్వేల్లోనూ చంద్ర‌బాబు ఫ‌స్ట్‌. సంతృప్త స్థాయిలోనూ 85 శాతం మార్కులు. ఒక‌ప‌క్క త‌మ్ముళ్లు ప‌ద‌వుల కోసం, ఆధిప‌త్యం కోసం కొట్టుకుంటున్నా.. అంతా బాగుంద‌నే స‌ర్వే రిజ‌ల్ట్‌! దీంతో మొత్తానికి ఏం జ‌రిగిందో గ‌త ఏడాది ఎన్నిక‌లు క్లారిటీ ఇచ్చాయి.

అయినా కూడా చంద్ర‌బాబు మార‌లేదు. త‌న స‌ర్వేల‌నే ప్ర‌జ‌ల‌పై రుద్దుతున్నారు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధానిపై స‌ర్వే చేప‌ట్టారు. చ‌డీ చ‌ప్పుడు లేకుండా చేసిన ఈ స‌ర్వేలో ఏకంగా 95 శాతం మంది ప్ర‌జ‌లు అమ‌రావ‌తికి అనుకూలం అంటూ.. చెప్పార‌ని తాజాగా చంద్ర‌బాబు త‌న సోష‌ల్ మీడియా ద్వారా వివ‌రించారు. వాస్త‌వానికి స‌ర్వే.. అంటే.. బాహాటంగా చేసేది. ఎంత మంది దీనిలో పార్టిసిపేట్ చేశారు? ఎంత మందిని ఎన్నిరూపాల్లో ప్ర‌శ్నించారు?  ప్ర‌జ‌ల మ‌నోభావాలు ఎలా ఉన్నాయి? వ‌ంటి అనేకానేక అంశాల‌ను ఈ స‌ర్వేలో ప్ర‌స్థావిస్తారు. అయితే, తాజాగా చంద్ర‌బాబు వెలువ‌రించిన అమ‌రావ‌తి స‌ర్వేలో ఈ వివ‌రాలు ఏమీ లేవు. ఉన్న‌దంతా.. ఏపీ ప్ర‌జ‌లు గుండుగుత్తుగా అమ‌రావ‌తినే రాజ‌ధానిని చేయాల‌ని కోరుతున్నార‌ట‌.

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలా వద్దా అన్నదానిపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆన్‌లైన్‌ సర్వేకు భారీ స్పందన లభిస్తోంద‌ని బాబు వెల్ల‌డించారు. ఈ సర్వేను ప్రారంభించిన ఆరు రోజుల్లో 3.76 లక్షల మంది తమ అభిప్రాయాన్ని తెలిపినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఏపీవిత్‌అమరావతి.కామ్‌ పేరుతో తెలుగుదేశం పార్టీ ఒక వెబ్‌ సైట్‌ను రూపొందించింది. ఈ సైట్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభించి..సర్వేకు శ్రీకారం చుట్టారు. కాగా, రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ సర్వేలో పాల్గొన్నవారిలో మెజారిటీ ప్రజలు కోరుకొంటున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 95శాతం మంది అమరావతి కొనసాగింపునే కోరారని తెలిపాయి.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇదే నిజం అనుకుందాం. రాష్ట్ర జ‌నాభా ఎంత‌? 5 కోట్ల పైచిలుకు ఉన్నార‌ని అధికారిక లెక్క‌లే చెబుతున్నాయి. మ‌రి అలాంట‌ప్పుడు కేవ‌లం  నాలుగు ల‌క్ష‌ల మంది అభిప్రాయాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు? అనే దానికి టీడీపీ వ‌ద్ద స‌మాధానం లేదు. పోనీ.. వీరంతా రోడ్ల మీద‌కు వ‌చ్చి.. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించాలి క‌దా? అంటే దానికి కూడా స‌మాధానం లేదు. ఇలా మొత్తానికి ఎందుకూ కొర‌గాని స‌ర్వేల‌తో చంద్ర‌బాబు స‌ర్వేల బాబుగా కాలం గ‌డుపుతున్నార‌నే వాద‌న ఆ పార్టీలోనే వినిపిస్తున్నది. మ‌రి అధికార ప‌క్షం విమ‌ర్శించ‌కుండా ఉంటుందా?!

Read more RELATED
Recommended to you

Exit mobile version