తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎంత వరకైనా పోరాడతాననే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు అదే తెలుగు వారి పరువును విదేశీ గడ్డపైనా తీసేస్తున్నారా? తన రాజకీయ లబ్ధి కోసం.. ఆయన ఎంత దూరమై నా వెళ్తున్నారా? ఈ విషయంలో ఏపీ పరువును బజారున కూడా పడేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నా రు సోషల్ మీడియా జనాలు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. నిజానికి చెప్పాలంటే..ఈ ఏడాది కాలంలో మూడు నెలల పాటు కరోనా నేపథ్యంలో పాలన ముందుకు సాగలేదు. ఇక, ఆదిలో రెండు మాసాల పాటు పాలనపై పట్టు బిగించడానికే సరిపోయింది.
ఇంతా చేస్తే.. మిగిలింది ఆరుమాసాల పాలన. ఈ పాలనలోనూ సచివాలయ వ్యవస్థ వంటి కీలక వ్యవస్థను తీసుకువచ్చారు. అమ్మ ఒడి వంటి అత్యద్భుతమైన పథకాలు ప్రవేశ పెట్టారని ప్రపంచం మొత్తం కొని యాడుతోంది. అయితే, ఇవేవీ కూడా చంద్రబాబుకు కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఆయనకు ఇవేవీ కనిపించకపోవచ్చు. తనదైన శైలిలో విమర్శలు చేయొచ్చు. అయితే, దీనికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రం, లేదా కేంద్రం వరకు మాత్రమే పరిమితం కావాలి. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి మహానాడులో చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక, ఇప్పుడు ఆయన విదేశాల్లోని తెలుగు వారికి కూడా పిలుపునిచ్చారు. జగన్ పాలనలో ఏమీ లేదని. చెత్తపాలనని, తుగ్లక్‌ను మరిపిస్తున్నాడని అంటూ.. తాజాగా చంద్రబాబు వివిధ దేశాల్లోని తన సామాజిక వర్గం ప్రజలకు ఆన్‌లైన్‌లో లెక్చర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏదైనా ఉంటే.. ఇక్కడ మాట్లాడుకోవాలి. కానీ, ఇప్పుడు ఏపీ పరువును విదేశాల్లోనూ తీసేయడం ఏమేరకు సమంజసం బాబూ అంటూ.. ప్రశ్నిస్తున్నారు. అంటే.. ఇప్పుడు రెండో ఏడాదిలో జగన్ విదేశీ పెట్టుబడులపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. వీటిని రాకుండా చేయడంలో భాగంగా చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తుండడం గమనార్హం.