గతంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ 23 మందిలో ఒక్క అద్దంకి ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ తప్ప మరెవరూ గత ఎన్నికల్లో గెలవలేదు. అద్దంకిలో రవి కూడా ఇంత వ్యతిరేకతలోనూ తన సొంత ఇమేజ్‌తోనే గట్టెక్కాడు. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి పాత టీడీపీ నాయకులే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వీరిని చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది పార్టీ మారిన నేతల పరిస్థితి.
2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. దీంతో ప్రతిపక్ష వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసే తాము పార్టీలోకి వెళుతున్నామని అప్పట్లో వారు ప్రకటించారు. ఇందులో నలుగురు ఎ మ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే మంత్రిపదవి దక్కించుకున్న నలుగురూ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ 23 మంది అప్పట్లో అధికారికంగా పార్టీలో చేరినప్పటికీ, స్థానిక టీడీపీ నాయకులు వీరితో ఎడంగానే ఉన్నారు.
వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో గిడ్డి ఈశ్వరి, కలమల వెంకటరమణ, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, అశోక్ రెడ్డి, సునీల్ కుమార్, జయ రాములు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ, చాంద్ భాషా వంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీని టీడీపీలో చేరినప్పటికీ ఎన్నికల్లో పార్టీ నేతలు సహకరించకపోవడం, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధినేత చంద్రబాబు పట్టించుకోకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
అదే వీరు నాడు వైసీపీలోనే ఉండి ఉంటే వీరిలో చాలా మంది ఈ సారి గెలిచి మంత్రులు కూడా అయ్యేవారు. వీరిలో గిడ్డి ఈశ్వరి, జ్యోతుల నెహ్రూ, జలీల్‌ఖాన్ ఉన్నారు. ఇక గొట్టిపాటి రవి గెలిచినా పార్టీ మారకుండా ఉండి ఉంటే మళ్లీ మంత్రి అయ్యేవాడు. ఇక ఓడిన వారి గురించి టీడీపీ వాళ్లే పట్టించుకోవడం లేదు. ఏదేమైనా బాబు యూజ్ అండ్ త్రో దెబ్బకు వీళ్లంతా బలైపోయారు.