కేవలం రెండంటే రెండు రోజులు మాత్రమే టైం పెట్టుకుని నిర్వహించిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశా లు సూపర్ ఫాస్ట్ వేగంతో ముగిసిపోయాయి. వాస్తవానికి ప్రతి ఏటా బడ్జెట్ సమావేశాలను కనీసం పది నుంచి పదిహేను రోజులు నిర్వహిస్తారు. కానీ, కరోనా మహమ్మారి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను కుదిపించారు. ఈ క్రమంలో కీలకమైన వార్షిక బడ్జెట్ను ఆమోదించారు. దీనికి సంబంధించి ఫార్మల్‌గానే ప్రధాన ప్రతిపక్షానికి ఆహ్వానం వెళ్లింది. గవర్నర్ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లోనే తన ఉభయ సభల ప్రసంగాన్ని చదవి వినిపించారు. సో.. దీనిని బట్టి .. చాలా పకడ్బందీగా సభ నిర్వహణ సాగిందనే విషయం స్పష్టమవుతోంది.
గవర్నర్ ప్రసంగం అయినవెంటనే గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం.. ఆ వెంటనే బడ్జెట్ ప్రసంగం.. తదుపరి రోజు చర్చ ఉంటుందని ముందుగానే స్పీకర్ వెల్లడించారు. ఈవిషయాలను అన్నింటినీ.. కూడా టీడీపీకి వివరించారు. బీఏసీలో చర్చించారు. అంతేకాదు, తమకు మాట్లాడే అవకాశం కావాలని టీడీపీ పట్టుబట్టినప్పుడు.. స్వయంగా సీఎం జగన్ స్పందిస్తూ.. తాను కూడా మాట్లాడడం లేదని, ఇప్పుడు కరోనా నేపథ్యంలో సభలను కుదించామని.. కాబట్టి అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు తన సబ్యులతో కలిసి.. సభలకు వెళ్లారు.
వాస్తవానికి చంద్రబాబు వ్యూహం అంతా కూడా.. తన పార్టీ నేతలను అరెస్టు చేయడంపై ప్రశ్నించడం. సభలో గందరగోళం సృష్టించడం. అయితే, ఇలాంటిదేదైనా జరిగితే.. వెంటనేచర్యలు తీసుకునేందుకు స్పీకర్ కూడా రెడీ అయ్యారు. అయితే.. చంద్రబాబు సభకు వెళ్లిన తర్వాత.. సభలో టీడీపీ బలం చాలా తక్కువగా కనిపించింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకి ఎమ్మెల్యేగొట్టిపాటి రవిలు సమావేశాలకు హాజరుకాలేదు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు.
ఇక, అచ్చన్నాయుడు అరెస్టయి ఆసుపత్రిలో ఉన్నారు. సో.. మొత్తంగా సభలో బాబుకు బలం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా ఆయన వాకౌట్ చేశారని టీడీపీలో చర్చ సాగుతుండడం గమనార్హం. పైగా బడ్జెట్‌లో తన పాలన లో కేటాయింపులను కూడా ప్రస్థావిస్తారని బాబుకు తెలుసునని అందుకే ఆయన మొత్తంగా సభలను వాకౌట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.