జగన్ పెట్టిన సీబీఐ కేసుల ప్రభావమో లేక తన రాజకీయ భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉందన్న ఆలోచనో తెలియదు కానీ… మోడీ పేరు చెబితే వణికీపోతున్నారు చంద్రబాబు! నిన్నమొన్నటివరకూ మోడీకి ప్రియదాసుడిని, పెద్ద ఫాలోవర్ ని అన్నట్లుగా మాట్లాడిన బాబు.. కరోనా సమయంలో కూడా తమ అనుమతిలేనిదే రాష్ట్ర ప్రజలను చూడటానికి సైతం వెళ్లలని, అలాగే మిగిలిపోయిన బాబు… మరోసారి మోడీ అంటే తనకు ఎంతభయమో చెప్పకనే చెప్పారు! కాకపోతే చాలా లాజికల్ గా.. ఎవరూ గ్రహించరులే అన్న స్థాయిలో!!
వివరాళ్లోకి వెళ్తే… కోవిడ్ ప్రభావంతో భారీగా ఆదాయం తగ్గి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలపై పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో మరింత అధనపు భారం పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు! ఎవరిని డిమాండ్ చేశారనుకున్నారు… ముఖ్యమంత్రి జగన్ ని!
అవును… రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై రూ.2.76, డీజిల్ పై రూ.3.07 వ్యాట్ వేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రజలపై ఎంతో భారం పడుతుందని, నిత్యావసరాల ధరలు పెరుగుతాయని బాబు తెలిపారు. ఆ సంగతులు అలా ఉంటే… కేంద్రం గత 15 రోజులుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్న విషయంపై బాబు సైలంట్ అయిపోయారు!
గత 15రోజుల్లో కేంద్రం డీజిల్ పై రూ. 8.88, పెట్రోల్ పై రూ.7.97 పెంచిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రతిరోజూ వరుసపెట్టి ధరలను పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఒక్క మాట కూడా అనలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు పెంచితే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయని చెబుతున్న ఆయన… సుమారు 9 రూపాయలవరకూ పెంచిన కేంద్రంపై మాత్రం ఒక్కమాటా అనరు.. ఒక్క ప్రశ్న సంధించరు.
సరికదా… పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించమని జగనే మోడీని డిమాండ్ చేయాలంట! తప్పేమీ కాదు చేయొచ్చు.. చేయమనొచ్చు.. కానీ… జాతీయస్థాయి పార్టీ అయిన టీడీపీ కి అధినేత అయిన వ్యక్తి… ఇలా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరలపై మాత్రమే స్పందించడం.. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలపై మౌనం వహించడమేమిటి? ఇక్కడ బాబుకు మోడీ అంటే ఉన్న భయాన్ని తెలుపుతుందని అంటున్నారు విశ్లేషకులు!
ఎందుకంటే… రాష్ట్రంలో బీజేపీ.. టీడీపీకి వ్యతిరేక పార్టీనే కాబట్టి… రాష్ట్రంలోని బీజేపీ నేతలపై కూడా బాబు ఒత్తిడి తేవచ్చు. మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీని ప్రశ్నించండి.. ధరలు తగ్గించమని డిమాండ్ చేయండి అనొచ్చు. కానీ అనరు.. ఒక్కమాటా అడగరు! ఇక తన పాత స్నేహితుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో కలిసి ఉంటున్నారు. ఆయన కూడా పెంచిన పెట్రోల్ ధరలపై స్పందించరు.. స్పందించమని బాబు డిమాండ్ చేయరు!! అన్నీ ఒకతానులో ముక్కలే అన్నట్లు!! ఈ విషయాలు ప్రజలకు అర్ధమవనంత కాలం ఎలాంటి ఇబ్బందిలేదులే అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు!