టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి అరెస్టుతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష నేతలు అధికారపక్షంపై విరుచుకుపడుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వెంటనే తనకు అందుబాటులో ఉన్న నేతలతో మాట్లాడారు. అచ్చెన్నాయుడిని బలవంతంగా కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యతని చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా అసెంబ్లీలో ఉపనేతగా ఉన్న ఆయన్ను, విచారించాలని భావిస్తే, చట్టపరమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలే తప్ప, ఇలా రాత్రిపూట దాడులకు దిగడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణమే హోమ్ మంత్రి రాజీనామా చేయాలని, అచ్చెన్నాయుడు ఎక్కడున్నారో వెంటనే డీజీపీ మీడియాకు తెలియజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా, ఈ తెల్లవారుజామున అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, ఆయన్ను విజయవాడకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.