రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ముగిసిన తరువాత చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి… చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ విచారణ రెండో రోజు ముగిసింది. తొలి రోజు చంద్రబాబును దాదాపు 50 ప్రశ్నలు అడగగా, రెండో రోజు సైతం అదే స్థాయిలో సీఐడీ అధికారులు టీడీపీ అధినేతపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు నేటితో చంద్రబాబుకు సీఐడీ కస్టడీ ముగియనుంది.
దాంతో చంద్రబాబును రాజమండ్రి జైలు నుంచి వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచింది సీఐడీ. మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు సంధించి చంద్రబాబు నుంచి సీఐడీ కొన్ని వివరాలు రాబట్టారు. డాక్యుమెంట్స్ చూపించి నిధులు ఎలా కేటాయించారని సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు ప్రశ్నించారు. షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపుపై సీఐడీ తమ అనుమానాలను విచారణలో ప్రస్తావించింది. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రశ్నించారు. రిమాండ్ పొడిగించాలన్న సీఐడీ అధికారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.