ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు హోరెత్తించారు. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఆడారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఓపెనర్ శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(72 నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్(52 ) దంచి కొట్టారు. దాంతో, టీమిండియా 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ తీసుకున్నాడు. అతడి అంచనాలను నిజం చేస్తూ కంగారు బౌలర్లు ఆదిలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(8) వికెట్ తీశారు. అయితే.. ఆ తర్వాతే అసలు విధ్వంసం మొదలైంది. ఆసీస్ పేసర్లను ఉతికారసిన శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో కదం తొక్కారు.
ఈ మ్యాచ్‌లో శుభ్ మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగడం ఒక ఎత్తైతే.. మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మరో ఎత్తు. వినూత్న షాట్లతో హోరెత్తించే సూర్య కంగారూలకు తన సత్తా ఏంటో చూపెడుతున్నాడు. మొదట్లో కాస్త ఆచి తూచి ఆడినట్లు కనిపించిన సూర్య.. కామెరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్‌లో మొదటి నాలుగు బంతులకు వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు.ఈ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. సూర్యుడి మెరుపులు ధాటికి స్టేడియం హోరెత్తిపోయింది.