ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికి చేరవేసే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను నెలకొల్పారు.. లక్షల సంఖ్యలో ఈ ఉద్యోగాలు ఇచ్చారు. నెలకు 5 వేల రూపాయల వేతనం వీరికి అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి అందించడం వీరి బాధ్యత. అందులో భాగంగా చౌక బియ్యం వంటివి వీరు నేరుగా ప్రజల ఇంటికే తెచ్చి ఇస్తున్నారు.
అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు దారుణమైన వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్లు కూడా ఒక ఉద్యోగమేనా అంటూ ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలని అన్నారు. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ల ఉద్యోగం ఇవ్వాలని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రజలకు ఈ వ్యవస్థ వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
గోనె సంచులు మోసే ఉద్యోగం, బియ్యం సంచులు మోయడం కూడా కూడా ఒక ఉద్యోగమేనా అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ.5వేల రూపాయలతో ఉద్యోగాలు అంటూ కథలు చెప్తారా అంటూ మండిపడ్డారు. ఇంత వరకూ ఓకే.. ఈ విమర్శలు ఎవరైనా చేస్తారు.. కానీ చంద్రబాబు అంతకు మించి మరీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లు తప్పుడు పనులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ మండిపడ్డారు. వాలంటీర్లమని చెప్పుకుంటూ ప్రజలను డిస్టర్బ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. పగటి పూట మగవాళ్లు ఉండని సమయంలో ఇంటికి వెళ్లి తలుపుకొడుతున్నారని ఆడవాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వంటి సీనియర్ నేత ఇలా మాట్లాడటం విచిత్రమే.