గన్నవరం విమానాశ్రయానికి అక్టోబరులో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచేందుకు విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. అందులో భాగంగా వచ్చే నెల నుండి గన్నవరం నుండి విశాఖ..హైదరాబాద్ కు సర్వీసులు పెంచాలని నిర్ణయించాయి. అలయెన్స్ ఎయిర్ అక్టోబర్ ఒకటి నుంచి హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌కు సర్వీస్‌లు నడపనుంది.
ఇందులో భాగంగా తొలుత విశాఖ.. హైదరాబాద్‌కు రెండు చొప్పున కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖకి ఏకంగా రెండు విమాన సర్వీస్‌లతో పాటు హైదరాబాద్‌కు అదనంగా రెండు సర్వీస్‌లను ఎయిర్‌లైన్స్ సంస్థలు నడపనున్నాయి. అలాగే కొత్తగా అందుబాటులోకి వస్తున్న సర్వీసుల వేళలను వెల్లడించారు. 70 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి 7.30కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.
25 నిమిషాల విరామం తరువాత 7.55 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8.55కు వైజాగ్‌కు చేరుకుని, తిరిగి అక్కడి నుంచి 9.20కు బయలుదేరి పది గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 45 నిమిషాల విరామం తర్వాత రాత్రి 10.45కు ఇక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అదే విధంగా మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్ అక్టోబర్ 27 నుంచి విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సర్వీస్‌లను ప్రారంభించనుంది.
78 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానం వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.50కు వైజాగ్‌కు చేరుకుంటుందని స్పైస్‌జెట్ ప్రతినిధులు ప్రకటించారు. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇండిగో విమాన సంస్థ అక్టోబరు 27 నుంచి హైదరాబాద్– విజయవాడ మధ్య అదనంగా మరో విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది.