చంద్రబాబు రూటు మార్చారా ..కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారా !

-

చంద్రబాబు అంటే.. ఆ పొలిటికల్‌ స్కూలే వేరు. రాజకీయంగా ఎంత అనుభవం సాధించారో.. దేశ రాజకీయాల్లో అంతే గుర్తింపు ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిగానే కాదు.. ఆ హోదాలో ఒక సీఈవోగానూ కనిపిస్తారు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా చేసిన ఆయనకు గడిచిన ఏడాదిన్నరగా పొలిటికల్‌ స్ట్రోక్‌లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 2019 ముందు వరకు ఓ లెక్క.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో లెక్క అన్నట్టు మారిపోయింది టీడీపీ పరిస్థితి. ఈ ప్రతికూల రాజకీయ వాతావరణంలో టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఆయన ఎంచుకుంటున్న మార్గాలే ప్రజలకు కొత్త చంద్రబాబును పరిచయం చేస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపించే టాక్‌.


ఫార్టీ ఇయర్స్‌ పొలిటికల్‌ ఇండస్ట్రీ. ఫ్రమ్‌ ది బిగినింగ్‌ ఒక ట్రెండ్‌ సెట్టర్‌. అలాంటిది ఏడాదిన్నరగా రూటు మార్చేశారు. ఇట్లు మీ చంద్రబాబు.. అని లేఖల మీద లేఖలు రాసి కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అదే పనిగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు చంద్రబాబు. చిత్తూరు ఎస్పీ మొదలుకొని.. డీజీపీ, సీఎస్‌, సీఎం జగన్‌లకు ఎడా పెడా లేఖలు రాసేస్తున్నారు. వీటిల్లో డీజీపీ గౌతం సవాంగ్‌కు వివిధ అంశాలపై రాసిన లేఖలే ఎక్కువ. టీడీపీ నేతలపై దాడులు.. ప్రజా సమస్యలు.. వరద సాయం.. విశాఖ గ్యాస్‌ బాధితులు ఇలా.. సమస్య ఏదైనా సుధీర్ఘ ప్రెస్‌మీట్లతోపాటు సంబంధిత విభాగాలకు ఆయన లేఖలు రాసి పడేస్తున్నారు.

చంద్రబాబుకు లేఖలు రాయడం కొత్త కాదు. కాకపోతే గతంలో ఆయన లేఖ రాస్తే ఏదో పెద్ద సందర్భం ఉంటేనే లెటర్‌ జోలికి వెళ్లేవారు. పైగా మీడియా, రాజకీయవర్గాల్లో చంద్రబాబు రాసిన లేఖలపై చర్చ జరిగేది. ఒకవేళ లేఖ ద్వారా జనాల్లోకి విషయం వెళ్లదని భావిస్తే.. మీడియా ముందుకు వచ్చి ఫ్రమ్‌ ది బిగినింగ్‌ వివరించేవారు. ఎవరైనా ప్రశ్న వేస్తే వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌ అనే ముక్తాయింపు లేకుండా ప్రెస్‌మీట్‌ ముగిసేది కాదు.

రాష్ట్ర విభజనకు ముందు దాదాపు పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు చంద్రబాబు. అప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు విపక్షనేతగా చంద్రబాబు ఎదుర్కొంటున్న పరిస్థితులు వేరు. కాలంతోపాటు పొలిటిల్‌ సమీకరణాలు… వ్యూహాలు మారిపోయాయి. అప్పటిలా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు వేస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. ఆ మధ్య మాచర్లలో టీడీపీ నేతలపై దాడి జరగడంతో డీజీపీ ఆఫీసు దగ్గర ధర్నాకు దిగారు చంద్రబాబు. టీడీపీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయం సంచలనమైంది. చంద్రబాబు ఏంటి.. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం ఏంటని అంతా అనుకున్నారు. వైజాగ్‌లోనూ పోలీసులు అడ్డుకోవడంతో ఎయిర్‌పోర్టు దగ్గర హైడ్రామా నడిచింది. ఇవన్నీ చూసిన చంద్రబాబు ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో లేఖాస్త్రాలను నమ్ముకున్నారని టాక్‌.

ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలోలా పదే పదే మీడియా ముందుకు వచ్చే అవకాశాల్లేవ్‌. అలాగని.. పార్టీ కార్యకర్తలను, నేతలను వేసుకుని సామూహిక ధర్నాలకు దిగే ఛాన్స్‌ అంతకంటే లేదు. కరోనా కాటేస్తుంది. ఆ మధ్య హత్యానేరంపై అరెస్టై బెయిల్‌పై వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పలకరించడానికి వెళ్లారు చంద్రబాబు. ఆ సందర్భంగా టీడీపీ అధినేత తీసుకున్న జాగ్రత్తలపై ప్రత్యర్థి పార్టీలు సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకున్నాయి. దాంతో రాజకీయంగా తప్పదు అని అనుకుంటేనే జనంలోకి వస్తున్నారు. సీఎంగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా జనంలో తిరగడం చంద్రబాబుకు అలవాటు. కరోనా పరిస్థితులు.. వయసు రీత్యా పర్యటనలు క్షేమం కాదనుకున్న చంద్రబాబు లేఖాస్త్రాలు మొదలుపెట్టారు.

కొన్నిసార్లు స్థాయికి తగని విధంగా, స్థాయికి తూగని వ్యక్తులకు చంద్రబాబు లేఖలు రాస్తున్నారని పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చిత్తూరు పోలీసులకు చంద్రబాబు లేఖ రాస్తే.. అక్కడి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇది ఆయన్ను ఆయన అవమానించుకోవడమే అని విమర్శలు వచ్చాయి. అయితే చంద్రబాబు లెక్కలు చంద్రబాబుకు ఎప్పుడూ ఉంటాయి. ఏ చిన్న అవకాశాన్నీ చంద్రబాబు వదలరు. లేఖలతో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం.. అది ప్రసార మాధ్యమాల్లో రావడం.. చర్చ కావడం..చంద్రబాబు స్ట్రాటజీ. ఇక స్థాయిభేదాలు చంద్రబాబు ఎప్పుడు పాటించరు. చేయాల్సింది చేయడం మైలేజీ రాబట్టడం తప్ప. ఈ కొత్త ట్రెండ్ చంద్రబాబుకి ఎంత మైలేజ్ తీసుకొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version