ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగ తేదీని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. చంద్రయాన్-3ని జూలై 13 మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ ప్రయోగం ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. అంతకుముందు సెప్టెంబరు 7, 2019న, భారతదేశం ‘చంద్రయాన్-2’ ప్రయోగించిన విషయం తెలిసిందే. కానీ చంద్రుని ఉపరితలంపై సరిగ్గా ల్యాండ్ కాకపోవడంతో విజయవంతం కాలేకపోయింది. ఇది చంద్రుని ఉపరితలం దక్షిణ ధ్రువం దగ్గర దిగాల్సి ఉంది.
చంద్రయాన్-3 ప్రయోగంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇస్రో ముందస్తుగానే చర్యలు చేపట్టింది. సమస్యలను నిరోధించేందుకు హార్డ్ వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్, సాఫ్ట్ వేర్, సెన్సార్లలో కీలక మార్పులు చేసినట్లు సోమనాథ్ తెలిపారు. అలాగే ల్యాండింగ్ సమయంలో కిందికి దిగి సమయంలో సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టెక్నాలజీని వినియోగించినట్లు తెలిపారు.