ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్‌ధామ్ యాత్రపై కొన్ని రూమర్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. యాత్ర నిలిపివేయబడిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. యాత్ర సాఫీగా, ప్రశాంతంగా కొనసాగుతోందని భక్తులకు భరోసా ఇచ్చారు. “చార్‌ధామ్ యాత్ర సజావుగా సాగుతోంది. ప్రజలు ఎలాంటి రూమర్లను నమ్మవద్దు. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారు. కేదార్‌నాథ్ యాత్రకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాం,” అని సీఎం ధామి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన వెల్లడించారు.

యాత్రకు సంబంధించిన ఇతర వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1364 లేదా 0135-1364ను సంప్రదించవచ్చని సీఎం ధామి సూచించారు. భక్తులు ఎలాంటి అనుమానాలున్నా ఈ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా, కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ యాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో, యాత్రకు సంబంధించిన సమాచారంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తోంది. భక్తులు ఎలాంటి అపోహలకు గురికాకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.