ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రజనీ ప్రయాణిస్తున్న కారును నిలిపి, అందులోనే ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రజనితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. “ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి” అంటూ రజని ప్రశ్నించగా, “మీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది” అని ఒక పోలీసు అధికారి హెచ్చరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో మంత్రి హోదాలో ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఇప్పటికే రజనిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఆమె మరిది గోపీని గత నెల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.